కోటి వృక్షార్చన అద్భుతంగా విజయవంతం

కోటి వృక్షార్చన అద్భుతంగా విజయవంతం

*దేవుడి దయ, ముఖ్యమంత్రి ఆశీస్సులు, అందరి సహకారంతో కోటికి పైగా మొక్కలు నాటే యజ్ఞం పూర్తయ్యింది*

*మన బాధ్యత మరింత పెరిగింది, నాటిన మొక్కలను వందశాతం బతికిస్తేనే సార్థకత*      

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను వెన్నతట్టి, కోటి వృక్షార్చన విజయవంతం చేసిన వారందరికీ రుణపడి ఉంటా ; ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు పుట్టిన రోజు సందర్భంగా హరితకానుకను ఇవ్వాలన్న సంకల్పం వంద శాతం నెరవేరిందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నాగోల్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానికులతో కలిసి మొక్కలు నాటడం ద్వారా కోటి వృక్షార్చనను ఎంపీ లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లోనూ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున తలపెట్టిన కోటి వృక్షార్చన అద్భుతంగా జరిగిందని, పాల్గొన్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఒకే రోజు కోటి మొక్కలు నాటాలని తలపెట్టిన యజ్ఞం ఊహించిన దాని కన్నా విజయవంతం అయిందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో స్వయంగా ముఖ్యమంత్రే తన పుట్టిన రోజు నాడు రుద్రాక్ష మొక్కనాటడం మరిచిపోలేని అనుభూతి అన్నారు.

తమకు అందుతున్న రిపోర్టుల ప్రకారం రాష్ట్రంతో పాటు, దేశ విదేశాల్లో సీఎం అభిమానులు కోటికి పైగా మొక్కలు నాటారని ఎంపీ తెలిపారు.

కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. కోటి వృక్షార్చన విజయవంతంతో బాధ్యత మరింత పెరిగిందని, నాటిన ప్రతీ మొక్కను వందశాతం బతికించాలని, రానున్న ఎండల నుంచి మొక్కలను అన్నింటినీ రక్షించుకోవాలని కోరారు. నీటి లభ్యత ఉన్న కారణంగా ప్రతీ ఒక్కరూ తమ పరిధిలో ఉన్న మొక్కల సంరక్షణను బాధ్యతగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

కోటి వృక్షార్చన కార్యక్రమం ప్రకటించిన నాటి నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను వెన్నతట్టి ప్రోత్సహించిన సినీతారలు, నాయకులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలందరిలో హరిత భావజాల వ్యాప్తిలో భాగమయ్యారని, హరిత తెలంగాణ సాధనలో వారి భాగస్వామ్యాన్ని నిరంతరం కోరుకుంటున్నట్లు ఎంపీ వెల్లడించారు.