100 DAYs క‌రోనా మృత్యుకేళి.

ఇద్ద‌రు బ‌ల‌వంతులు పోటీపడితే యుద్ధం అంటారు. అదే ఒకరు ఏక‌దాటిగా దాడి చేస్తే దాన్ని దండ‌యాత్ర అంటారు. అవును ఇది నిజం ప్రపంచంలో ఎవరికి కంటికి కనబడకుండా సూక్ష్మజీవి క‌రోనా మ‌హ‌మ్మారి చేస్తున్నది దండ‌యాత్రే. ఏప్రిల్ రెండో వారంతో క‌రోనా వైరస్ విశ్వములో విజృంభించి 100 Days పూర్తి చేసుకుంది. కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో యావ‌త్ ప్ర‌పంచ‌మంతా కన్నీరు మున్నీరై యుద్ధం చేస్తున్న‌ది. కానీ, ఈ దండ‌యాత్ర‌లో చివ‌రి గెలుపు నిజంగా మాన‌వుడిదే… నిస్తేజంగా ఆశతో ఎదురు చూస్తోన్న మ‌నిషిదే! అయితే,

100 రోజుల్లో వైరస్ మ‌హ‌మ్మారి చేసిన ఉన్మాదం ఎంత‌… ఉత్పాతం మ‌రెంత‌? అని మీకు NEWSBAZAR9.COM అందిస్తోంది పూర్తి వివరాలు…

ప్రస్తుతం ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ప్రతి మనిషి కూడా ఈ కరోనా మహామ్మారి దెబ్బకు వణికిపోతున్నారు. దీనికి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచమే పూర్తిగా స్తంభించి పోయింది. ఓ దేశానికీ మరో దేశానికీ మధ్య రవాణా ఆగిపోయింది. సరిహద్దులు పూర్తిగా మూసివేశారు. గత డిసెంబర్ 31న చైనా తొలిసారిగా వైరస్ అధికారికంగా గుర్తించినట్టు ప్రకటించింది. జనవరి 1న ఊహాన్ సముద్రపు జీవులు అమ్మే మార్కెట్ సమీపంలో ఈ వైరస్ సోకిందనే ఆందోళనతో ఆ ప్రాంతాన్ని షట్ డౌన్ చేశారు. 2020 నూతన సంవత్సరానికి ఒక్క రోజు ముందు… ప్రపంచం మొత్తం ఆనందంలో మునిగిపోతున్న సమయంలో డిసెంబర్ 31 – 2019న చైనా ప్రభుత్వ వెబ్ సైట్ లో కరోనా తొలి అధికార ప్రకటన వచ్చింది. ఆ వార్తను అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, మత్తులో మజా చేస్తూ కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతున్నారు. చైనా దక్షిణ ప్రాంతంలో సముద్రజీవుల మాంసం విక్రయించే మార్కెట్ లో ఓ మధ్య వయస్కురాలితో పాటు మరో 30 మందిలో కనిపించిన ఆ న్యుమోనియా లక్షణాలపై ఆరోగ్య శాఖ అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు (WHO) నివేదిక పంపారు.

WHO ఈ కరోనా వైరస్ గుర్తించినట్టు తెలిపింది. కానీ చైనా బయట ఈ కరోనా లక్షణాలేవీ అప్పటికి కనిపించలేదు. అప్పుడు మాత్రం కేవలం చైనాలో ఈ ప్రకటన తర్వాత ఒక్కో రోజు గడుస్తుంటే ప్రళయం సరిహద్దులు దాటి.. మన దేశానికి.. మన నగరానికి – మన వీధిల్లోకికి వస్తే ఎలా ఉంటుందో ప్రజలందరికీ వంద రోజుల్లోనే అర్థమైపోయింది.

క‌రోనా నేర్పిన క‌ఠిన గుణపాఠాలు-వాస్త‌వాలు
చైనాలోని ఊహాన్ నగరంలో వ్యాధికి కారణమేమిటన్న విషయం స్పష్టమైన కొన్ని రోజులకే ప్రాణాంతక కరోనా వైరస్ చైనా సరిహద్దులు దాటుకుని థాయ్ లాండ్ దేశంలోకి అడుగు పెట్టేసింది. ఊహాన్ నగరంలో నివసించే 61 ఏళ్ల వ్యక్తికి జ్వరం లక్షణాలు ఉన్నట్లు బ్యాంకాక్ విమానాశ్రయ అధికారులు థర్మల్ స్కానర్ల సాయంతో గుర్తించారు. అలాగే చైనాలో అంతకంతకు ఒకట్రెండు వారాల్లోనే చాలా ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలున్న వారు భారీ సంఖ్యలో చేరుతున్నట్లు ఊహాన్ లో వెద్యులు గుర్తించారు. ఆ తరువాత వైరస్ ఉనికి కనిపించిన 20 రోజులకు గువాంగ్ డాంగ్ ప్రాంతంలో రెండు కొత్త కేసులు బయటపడ్డాయి. వీరికి ఊహాన్ తో ఏ సంబంధమూ లేదని ప్రకటించారు. దీనితో వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతున్నట్లు అర్థమైంది. ఆ తరువాత యూరోపియన్ దేశాలలో కరోనా వ్యాప్తి చెందటం మొదలుపెట్టింది. స్పెయిన్ – ఇటలీల్లో తొలి కేసులు నమోదయ్యాయి. అప్పటికే చైనాలో 258 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 11 వేల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీనితో చైనా వెళ్లి వచ్చిన వారిపై అమెరికాలో నిషేధం మొదలైంది. ఇక జనవరి చివరి కల్లా ఈ వైరస్ భారత దేశంతో పాటు – ఫిలిప్పీన్స్ – రష్యా – స్వీడన్ – బ్రిటన్ దేశాలకూ విస్తరించింది. 44 ఏళ్ళ ఊహాన్ నివాసి ఒకరు ఫిబ్రవరి తొలివారంలో ఫిలిప్పీన్స్ లో మరణించడంతో చైనా బయట తొలి కరోనా మరణం నమోదైంది.

WHO క‌రోనాని మ‌హామ్మారిగా ఎప్పుడు ప్ర‌క‌టించింది?

ఈ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన 70 రోజుల తరువాత కరోనాను విశ్వ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. అప్పటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య 1లక్ష 16 వేలకు చేరుకుంది. ఆ తర్వాత అమెరికాలో కరోనా విజృంభణ మొదలైంది. భారతదేశ విషయానికి వస్తే మార్చి 12న సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి మరణంతో భారత్ లో తొలి కరోనా మరణం కర్ణాటకలో నమోదైంది. కానీ తొలి కరోనా కేసు 30 జనవరి నెలలో కేరళలో నమోదైంది. 2020 మార్చి 22న ఓ రోజు జనతా కర్ఫ్యూ – ఒక రోజు విరామం తర్వాత మార్చి24 నుంచి 3 వారాల పాటు దేశవ్యాప్త లాక్ డౌన్ కేంద్ర సర్కారు ప్రకటించింది. ఏప్రిల్ 12తో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి 100 రోజులు దాటేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య దాదాపు 18 లక్షలకు చేరగా – మరణాలు లక్ష 10వేలు దాటాయి. మన దేశంలో దాదాపుగా కరోనా కేసులు 9వేలకు చేరువవుతున్నాయి అలాగే దాదాపు 294 మరణాలు చోటు చేసుకున్నాయి. అలాగే లాక్ డౌన్ ఏప్రిల్ 30th 2020 వరకు కొనసాగించే అవకాశలున్నాయి. ఇప్పటికే పంజాబ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాలు పొడగింపు ప్రకటించేసాయి. 135 కోట్ల జనాభా ఇళ్లకే పరిమితం అయ్యారు. దేశ ఆర్థిక స్థితిగతులు, మౌళికవసతులు, రవాణా, విద్య, వ్యాపారాలు, లావాదేవీలు ఒక్కటేంటి అన్ని రంగాలు అటకెక్కాయి. భారతీయుల కార్యాచరణ, కర్తవ్యాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముంబయి నుంచి మయన్మార్ సరిహద్దు వరకు మూతపడ్డాయి. ఎప్పటికి మన దేశాన్ని ఈ మహామ్మారి వదిలి మనల్ని ప్రశాంతంగా మళ్లీ పాత రోజుల్లా బతికనిస్తుందో ఆగమ్యగోచరమైన పరిస్థితులు తలెత్తాయి.

USAలో స్థితిగతులు..
అగ్ర‌రాజ్యం USAలో అమెరికన్లు, NRIs, ఇతర దేశస్తులు జీవితంలో ఎన్నడూ ఊహించని తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. NRIs వైద్యం కోసం మందులు, డాక్టర్ల ఆదేశానుసారం నెలవారీ కోర్సులకు వాడే షుగర్, బీపీ, ఇతర మందులు అష్టదిగ్బంధనం కారణంగా అందుబాటులో లేకుండా పోయాయి. మరోవైవు ఇండియాకు తిరిగి రాలేని దుస్థితి.
అలాగే అమెరికన్లయితే కనీసం తినేందుకు తినుబండారాలు తీవ్ర కొరత ఎదుర్కొంటున్నారు. వైద్య సేవలు, డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో లేక ఆందోళనలు, కనీసం కరోనా కారణంగా మృతి చెందిన మృతదేహాలకు అంత్యక్రియలకు ఆటంకాలు/స్మశాన వాటికలు కిక్కిరిసి పోతున్నాయి.

ఐరోపా ఖండంలోని ఇటలీ, స్పెయిన్, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అతలాకుతలమయ్యాయి, అవుతూనే ఉన్నాయి. అలాగే పర్షియా, టర్కీ, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా ఒక్కటేంటి 210 దేశాల్లో కరోనా కరాల నృత్య తాండవం ఆడుతోంది. ఏమైనా విశ్వంలో కరోనా నిర్మూలనకు మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. అందుకే తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేశించిన విధంగా ఇంటికే పరిమితవ్వాలి, లాక్ డౌన్ విధానంకు సహకరించాలి. సామాజిక దూరం పాటించాలి.