నవంబర్ నెలలో 1,31,526 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలు

 

 

 

 

 

దేశంలో 2021 నవంబర్ నెలలో 1,31,526 కోట్ల రూపాయల విలువ చేసే జీఎస్టీ వసూలు అయ్యింది. దీనిలో సి జీఎస్టీ 23,978 కోట్ల రూపాయలుగా, ఎస్ జీఎస్టీ 31,127 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ 66, 815 కోట్ల రూపాయలు ( దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన 32,165 కోట్ల రూపాయలను కలుపుకుని), సెస్ గా 9,606 కోట్ల రూపాయలు (వస్తువుల దిగుమతిపై సేకరించిన 653 కోట్ల రూపాయలతో సహా) ఉన్నాయి.

ఐజీఎస్టీ ఆదాయంలో సి జీఎస్టీ కి 27,273 కోట్ల రూపాయలను, ఎస్ జీఎస్టీ కి 22,655 కోట్ల రూపాయలను ప్రభుత్వం సర్దుబాటు చేసింది. సాధారణ సర్దుబాట్లు పూర్తయిన తరువాత 2021 నవంబర్ నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లభించిన ఆదాయం 51,251 కోట్ల రూపాయలు (సి జీఎస్టీ), 53,782 కోట్ల రూపాయలు (ఎస్ జీఎస్టీ) గా ఉంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ పరిహారంగా కేంద్రం 03.11.2021న 17,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

దేశంలో వరుసగా రెండో నెలలో జీఎస్టీ వసూళ్లు 1.30 లక్షలకు మించి జరిగాయి. గత ఏడాది నవంబర్ తో పోల్చి చూస్తే దేశంలో 2021 నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 25%, 2019-20 నవంబర్ తో పోల్చి చూస్తే 27% మేరకు పెరిగాయి. ఈ నెలలో దేశంలో జరిగిన లావాదేవీలు ( సేవల దిగుమతితో కలుపుకుని)కంటే దిగుమతి చేసుకున్న వస్తువులపై 43% ఎక్కువ ఆదాయం వచ్చింది. గత ఏడాది నవంబర్ తో పోల్చి చూస్తే ఈ వృద్ధి 20% వరకు ఉంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత 2021 నవంబర్ నెలలో రెండోసారి అత్యధిక వసూళ్లు నమోదు అయ్యాయి. 2021 ఏప్రిల్ లో అత్యధిక జీఎస్టీ వసూళ్లు జరిగాయి. సంవత్సరాంతపు రాబడులకు సంబంధించిన ఈ వసూళ్లు గత నెల వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. మూడు నెలలకు ఒకసారి రిటర్న్‌లను దాఖలు చేయవలసిన అంశం ప్రభావం కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు సాగుతున్నాయి.

పన్ను చెల్లింపుల అంశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పరిపాలనా పరమైన చర్యల వల్ల జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. రాష్ట్ర సంస్థల సహకారంతో కేంద్ర కేంద్ర పన్ను అమలు ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తూ పన్ను ఎగవేతదారులను గుర్తిస్తున్నాయి. జీఎస్టీఎన్ అభివృద్ధి చేసిన వివిధ ఐటీ పరికరాలు ఉపయోగిస్తూ సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి. నకిలీ ఇన్‌వాయిస్‌లను ఉపయోగిస్తూ పన్ను చెల్లించకుండా వ్యాపారులు తప్పించుకుంటున్నారని గుర్తించడం జరిగింది. దీనిని అరికట్టడానికి రిటర్న్, ఇన్‌వాయిస్ మరియు ఇ-వే బిల్లు సమాచారాన్ని విశ్లేషిస్తూ అనుమానాస్పద పన్ను చెల్లింపుదారులను గుర్తించడం జరుగుతోంది.

వ్యవస్థ సామర్ధ్యాన్ని మెరుగు పరచడానికి, గడువు ముగిసినా రిటర్న్ దాఖలు చేయని వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం, , ఇ-వే బిల్లులను నిరోధించడం మరియు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఆమోదించడం వంటి చర్యలను గత ఏడాది ప్రభుత్వం అమలు చేసింది. ప్రభుత్వం మేలు చేస్తున్న చర్యల వల్ల గత కొద్ది నెలలుగా ఎక్కువ మంది రిటర్న్‌లను దాఖలు చేస్తున్నారు.