“1st” మొబైల్‌ వైరాలజీ ల్యాబ్

హైదరాబాద్‌లో DRDO &ESIC సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో, దేశంలోనే మొదటిసారిగా ‘మొబైల్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్’ హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్రారంభమైంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించారు. DRDO& ESIC సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ల్యాబ్, కరోనా పరీక్షలతో పాటు వైరస్‌ కల్చర్‌, వ్యాక్సిన్‌ తయారీలపై పనిచేయనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర కార్మిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) సంతోష్‌ గాంగ్వార్‌, హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి లతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు, DRDO చైర్మన్ సతీష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొవిడ్ వైరస్ నియంత్రణలో భాగంగా డిఆర్‌డిఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) శాస్త్రవేత్తలు చాలా కృషి చేస్తున్నారని, నిర్మాణానికి దాదాపు 6నెలలు పట్టే వైరాలజీ ల్యాబ్ ని కేవలం 15రోజుల్లోనే ఏర్పాటు చేసిన DRDO&ESIC సంస్థలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సదుపాయం హైదరాబాద్ లో మొదటగా అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

“సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ల్యాబ్ ను ఏర్పాటు చేసిన రాజ్ నాథ్ సింగ్, సంతోష్ గంగ్వార్ లకు ప్రత్యేక ధన్యవాదాలు” అని కిషన్ రెడ్డి అన్నారు.

కరోనాను ఎదుర్కోవడంలో టెస్టులు ఎంతో ఉపయోగపడతాయని, అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన సాంకేతికతతో రూపొందించిన బయోసేఫ్టీ లెవల్‌ (బీఎస్‌ఎల్‌)- 3 వైరాలజీ ఈ ల్యాబ్ లో 1000 నుంచి 2000 టెస్ట్ లు చేయవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి దేశవ్యాప్తంగా 304 టెస్టింగ్ ల్యాబ్ లను, 755 కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులను సిద్ధం చేసాం, అని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం కొవిడ్ పేషెంట్లకు ఒక లక్షా 86వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, వీటిలో 24వేల ఐసియు బెడ్స్ ఏర్పాటు చేశామని, మంత్రి తెలిపారు. “దేశవ్యాప్తంగా 3000 క్వారంటిన్ సెంటర్స్ సేవలందిస్తున్నాయి, మేకిన్ ఇండియా కింద BHEL, DRDO ఇతర ప్రైవేట్ సంస్థలతో కలిపి పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తయారు చేసుకుంటున్నామని, వెంటిలేటర్ల తయారీలో కూడా అనేక ప్రబుత్వ, ప్రైవేట్ సంస్థలు, పనిచేస్తున్నాయని, మంత్రి తెలిపారు.

ప్రజల సహకారంతోనే ఈ వైరస్ వ్యాప్తి ని ఎదుర్కోవటం సాధ్యమవుతుందని, గ్రామీణ ప్రజలు నో కరోనా అంటూ స్వీయ కట్టడి చేసుకుంటుంటే, పట్టణ ప్రజలు మాత్రం ఆవో కరోన అంటున్నారు, ఇది మంచి పద్ధతి కాదని మంత్రి తెలిపారు. కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కొంటే ప్రపంచంలోనే భారత్ గొప్ప శక్తివంతమైన దేశం అవుతుంద ని, దీనికి అందరి సహకారం అవసరమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.