2020లో 200 ఐపీఎస్‌ల నియామకం

ఈ ఏడాది 200 ఐపీఎస్‌ల నియామకం
రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా ఈ ఏడాది 200 మంది ఐపీఎస్‌ అధికారులను నియమించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు ప్రధాన మంత్రి కార్యాలయంలోని సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. కమల్‌ కుమార్‌ కమిటీ సిఫార్సుల ప్రాతిపదికపై సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా 2009 నుంచి 2019 వరకు ఏటా 150 మంది ఐపీఎస్‌ అధికారుల నియామకం జరుగుతోంది. అయితే ఈ ఏడాది ఈ సంఖ్యను 200కు పెంచాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. బస్వాన్‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా 2012 నుంచి ఏటా 180 మంది ఐఏఎస్‌ అధికారుల నియామకం జరుగుతోందని ఆయన చెప్పారు. 2020 సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌కు సంబంధించిన నియమ నిబంధనలను ఈ ఏడాది ఫిబ్రవరి 12న నోటిఫై చేసినట్లు తెలిపారు. రెగ్యులర్‌ నియామకం కింద ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్యాడర్‌ బలాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి ప్రభుత్వం ముందర లేదని ఆయన తెలిపారు.