ఇండియాలో 3.5 లక్షల కరోనా కేసులు… 10వేలు దాటిన మరణాలు

భారత దేశంలో కరోనా లెక్కలు నానాటికీ పెద్దవవుతున్నాయి. తాజాగా… 24 గంటల్లో 10974 మందికి కరోనా సోకడంతో… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 354065కి చేరింది. అలాగే… నిన్న ఒక్క రోజే… 2003 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య… 11903కి చేరింది. మరణాల రేటు 2.9 శాతం నుంచి 3.4 శాతానికి పెరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నట్లే. ఎందుకంటే ప్రస్తుతం రోజూ 300 మంది లోపు చనిపోతున్నారు. అలాంటిది నిన్న ఒక్క రోజే… 2003 మంది చనిపోవడం షాకింగ్ విషయమే. నిన్నటి మరణాల్లో… మహారాష్ట్రవి 1409 ఉండగా… ఢిల్లీవి 437 ఉన్నాయి. మొత్తం మరణాల్లో భారత్ ఇప్పుడు టాప్ 8కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ కేసులు 186934గా ఉన్నాయి. రికవరీ రేటు 52.8 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 155227గా నమోదయ్యాయి. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది.నిన్న ఇండియాలో అత్యధికంగా 163187 మందికి టెస్టులు జరిగాయి. ఇప్పటివరకూ ఒకే రోజులో ఇవే అత్యధిక టెస్టులు. మొత్తం టెస్టుల సంఖ్య 60 లక్షలు దాటి… 6084256కి చేరింది. కరోనాను ఎలా కట్టడి చేయాలనే అంశంపై నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… కొన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. ఇవాళ కూడా మరింత మంది సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, చెబుతున్ని అభిప్రాయాల్ని బట్టీ… కేంద్రం నెక్ట్స్ ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకోనుంది. నిన్న దేశ ప్రజలతో ప్రసంగించిన ప్రధానమంత్రి… కరోనాపై మనం చక్కగా పోరాడుతున్నామని తెలిపారు. ఇదే పట్టుదలతో ముందుకెళ్లాలని కోరారు.