జనవరి 29న విడుదల కాబోతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, సినిమా ఈవెంట్ లో అపశృతి

జనవరి 29న విడుదల కాబోతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, సినిమా ఈవెంట్ లో అపశృతి

ప్రముఖ బుల్లితెర యాంకర్, సినీ నటుడు ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లుగా విడుదల కాని ఈ చిత్రం జనవరి 29న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని చిత్రబృందం హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.అయితే హీరో ప్రదీప్ మాట్లాడుతున్న సమయంలో వేదికపైనే ఉన్న చిత్ర దర్శకుడు మున్నా ఒక్కసారిగా తూలి పడిపోయారు. కళ్లు తిరగడంతో కుప్పకూలారు. దాంతో ప్రెస్ మీట్ లో కలకలం రేగింది. ప్రథమ చికిత్స అనంతరం మున్నా కోలుకున్నారు. దాంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. సినిమా రిలీజ్ నేపథ్యంలో ఊపిరి తిప్పుకోని షెడ్యూల్ కారణంగానే ఒత్తిడికి గురై మున్నా కళ్లు తిరిగి పడిపోయినట్టు భావిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని నీలినీలి ఆకాశం అనే పాట ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రదీప్, అమృతా అయ్యర్ జంటగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మున్నా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్నాయి.