నెలలో 44 ఆక్సిజన్​ ప్లాంట్లు: అరవింద్​ కేజ్రీవాల్​

నెలలో 44 ఆక్సిజన్​ ప్లాంట్లు: అరవింద్​ కేజ్రీవాల్​

రాబోయే నెల రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో 44 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. అందులో కేంద్ర ప్రభుత్వం 8 ప్లాంట్లను ఏర్పాటు చేస్తుండగా, తాము 36 ప్లాంట్లను నెలకొల్పుతున్నామన్నారు. మెడికల్ ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము ఏర్పాటు చేయబోతున్న ప్లాంట్లలో ఫ్రాన్స్ నుంచి 21 రెడీమేడ్ ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించుకుంటున్నామన్నారు. మిగతా 15 ప్లాంట్లను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ట్యాంకర్ల కొరత ఉందని, కాబట్టి బ్యాంకాక్ నుంచి 18 ట్యాంకర్లను దిగుమతి చేసుకున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆక్సిజన్ కొరతకు సంబంధించిన పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిందని ఆయన చెప్పారు. ఆక్సిజన్ సరఫరా మెరుగుపడిందని, ఆసుపత్రులు మళ్లీ రోగులను చేర్చుకుంటున్నాయని చెప్పారు.