జ‌ర్న‌లిస్టుల‌కు 50 ల‌క్ష‌ల భీమా క‌ల్పించాలి

హైద‌రాబాద్‌: క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్రంలోని వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల‌కు రూ.50 లక్ష‌ల భీమా వ‌ర్తింప‌జేయాల‌ని టి.జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్ ప్ర‌భుత్వాన్ని కోరింది.  ఫోర‌మ్ రాష్ట్ర అధ్య‌క్షులు ప‌ల్లె ర‌వికుమార్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మేక‌ల కృష్ణ ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో జ‌ర్న‌లిస్టులు క‌రోనా బారిన‌ప‌డుతున్న అంశాన్ని సీఎస్ కు గుర్తు చేశారు.

క‌రోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, పారిశుద్ధ్య కార్మికుల‌తోపాటు జర్న‌లిస్టులు కూడా ముఖ్య‌భూమిక పోషిస్తున్నార‌ని సీఎస్‌కు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల‌కు ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న భీమాను జర్న‌లిస్టుల‌కు కూడా వ‌ర్తింప‌జేయాల‌ని విజ్క్ష‌ప్తి చేశారు. క‌రోనాబారిన‌ప‌డి జ‌ర‌గ‌కూడ‌నిది ఏమైనా జ‌రిగితే జ‌ర్న‌లిస్టుల కుటుంబాలు రోడ్డునప‌డే ప్ర‌మాదం ఉంద‌ని, ఈ నేప‌థ్యంలో ప్రాణాల‌ను ఫ‌ణంతా పెట్టి స‌మాజం కోసం ప‌ని చేస్తున్న జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌కు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని ఫోర‌మ్ నేత‌లు సీఎస్‌కు వివ‌రించారు.

అలాగే ఈ సంక్షోభ కాలంలో ప్ర‌తి జ‌ర్న‌లిస్టుకు నెల‌కు రూ.10 వేలు ఇవ్వాల‌ని సీఎస్‌ను కోరారు. అలాగే క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌త్రిక‌లు, చాన‌ళ్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ‌ని, వాటితోపాటు చిన్న‌ప‌త్ర‌ల‌కు యాడ్స్ రూపంలో ఆర్థికంగా చేయూత‌నివ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. టి జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్ త‌న దృష్టికి తీసుకొచ్చిన అంశాల‌పై సీఎస్ సానుకూలంగా స్పందించారు. ప‌త్రిక‌లు, చాన‌ళ్లకు యాడ్స్ ఇచ్చే అంశాన్ని అక్క‌డే ఉన్న స‌మాచార‌శాఖ క‌మిష‌న‌ర్ ఆర‌వింద‌కుమార్‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిశీలించాల్సిందిగా కోరారు. టి జర్న‌లిస్టుల ఫోర‌మ్ అభ్య‌ర్థ‌న‌ల్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్తాన‌ని సీఎస్ హామీ ఇచ్చిన‌ట్టు ఫోర‌మ్ నేత‌లు చెప్పారు.