ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు

హైదరాబాద్లోని కేబీఆర్‌ పార్క్‌ సమీపంలో ఇటీవల టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనకు సంబంధించి నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదైంది. టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు పలువురు కార్యకర్తలపై 504, 506, 427 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అడ్వైర్టెజ్‌మెంట్‌ బోర్డులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ వాటిని అద్దెకు తీసుకుని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే, హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంది.అయితే, కొన్ని రోజుల క్రితం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ… ఒక మునిసిపల్‌ మంత్రిగా ఉన్న కేటీఆర్.. ఇష్టానుసారంగా ఏజన్సీలకు రాత్రికి రాత్రే హోర్డింగ్‌లు పెట్టేందుకు ఆర్డర్‌లు ఇచ్చారని చెప్పారు. టెండర్లు పిలవకుండా ఏజెన్సీలకు ఏ విధంగా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. స్తంభాలు, రోడ్లపై ఉన్న టాయిలెట్ల మీద పెట్టుకున్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలను కార్యకర్తలు ఎక్కడికక్కడ చించేయాలని అరవింద్‌ పిలుపునిచ్చారు.