నగర వాసులను భయపెడుతున్న వరుస భూప్రకంపనలు

నగర వాసులను భయపెడుతున్న వరుస భూప్రకంపనలు

హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా వరసగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఇటీవల బోరబండ, జూబ్లీహిల్స్, రహమత్‌నగర్ ప్రాంతాల్లో పెద్ద శబ్దంతో రెండుసార్లు ఈ ప్రకంపనలు సంభవించగా, తాజాగా గచ్చిబౌలి టీఎన్‌జీఓస్ కాలనీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో మంగళవారం రాత్రి సంభవించాయి. పలుమార్లు కొన్ని క్షణాలపాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు మొదలైన భూ ప్రకంపనలు బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకు పలుమార్లు సంభవించినట్టు స్థానికులు తెలిపారు. అలాగే, నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి గంటకోసారి భారీ శబ్దాలతో భూమి కంపించినట్టు చెప్పారు.గత రాత్రి కూడా భూమిలోంచి పెద్ద శబ్దాలు రావడంతో భయంతో వణికిపోయిన కాలనీ వాసులు రోడ్లపైకి వచ్చేశారు. సమాచారం అందుకున్న అధికారులు కాలనీకి చేరుకుని ప్రజలకు ధైర్యం చెప్పారు. డీఆర్ఎఫ్ బృందాలను వారికి అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. భూమి నుంచి శబ్దాలు ఎందుకు వస్తున్నాయో నిపుణులను సంప్రదించి తెలుసుకుంటామన్నారు.