తన తదుపరి చిత్రంలో అంధురాలు గా కనిపించనున్న నటి నయనతార

తన తదుపరి చిత్రంలో అంధురాలు గా కనిపించనున్న నటి నయనతార

తమిళ, తెలుగు భాషల్లో గత పదిహేడు సంవత్సరాలుగా కథానాయికగా కొనసాగుతున్న నయనతార అటు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే.. అప్పుడప్పుడు ఇటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటిస్తుంటుంది. గ్లామరస్ తారగా ఎంతటి పేరుతెచ్చుకుందో, అభినయం పరంగా కూడా అంతే పేరుతెచ్చుకుంది. అందుకే, తన తర్వాత ఎందరు కొత్త హీరోయిన్లు వచ్చినా తన ప్రస్థానాన్ని ఇంకా ఆమె కొనసాగించగలుగుతోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు తాజాగా తమిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. దీని పేరు ‘నెట్రిక్కన్’ (మూడో కన్ను). ఈ చిత్రాన్ని ఆమె ప్రియుడు, కాబోయే భర్త, ప్రముఖ దర్శకుడు అయిన విఘ్నేశ్ శివన్ నిర్మిస్తుండగా.. ‘గృహమ్’ ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్నాడు.విశేషం ఏమిటంటే, ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా విభిన్న తరహా పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి విశేష ఆదరణ లభిస్తోందని విఘ్నేశ్ శివన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది నయనతార నటిస్తున్న 65వ సినిమా. తెలుగులో కూడా దీనిని రిలీజ్ చేస్తారు!