అడవుల్లో కరోనా నిబంధనలు. తప్పడంలేదు.

దేశంలోని జాతీయ పార్కులు/అభయారణ్యాలు/టైగర్ రిజర్వులలో కోవిడ్-19 నియంత్రణ మరియు నిర్వహణ పై సూచనలు జారీ చేసింది పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ.దేశవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో, అలాగే న్యూయార్క్ నగరంలో ఓ పులి కోవిడ్-19 బారిన పడటంతో పర్యావరణం, అడవులు, జాతీయ పార్కులు అభయారణ్యాలు/టైగర్ రిజర్వులలో కోవిడ్-19 నియంత్రణ, నిర్వహణలకు సంబంధించి సూచనలు జారీ చేసింది. జాతీయ పార్కులు/అభయారణ్యాలు/టైగర్ రిజర్వులలో నివసించే జంతువులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని భావించడం జరిగింది. అదేవిధంగా ఈ వైరస్ మానవుల నుండి జంతువులకు, జంతువుల నుండి మానవులకు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంది.

ఈ సూచనలను పాటించవలసిందిగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రధాన వన్యప్రాణి సంరక్షణాధికారులకు విజ్ఞప్తి చేశారు.

1.జాతీయ పార్కులు/అభయారణ్యాలు/టైగర్ రిజర్వులలో మానవుల నుండి జంతువులకు, జంతువుల నుండి మానవులకు వైరస్ వ్యాప్తి చెందకుండా వెంటనే తగిన నివారణ చర్యలు తీసుకోవాలి.
2.మానవులు, జంతువులు కలవడాన్ని తగ్గించాలి.
3.జాతీయ పార్కులు/అభయారణ్యాలు/టైగర్ రిజర్వులలో మనుషుల కదలికలను నియంత్రించాలి.
4.ప్రస్తుత పరిస్థితిని నిర్వహించడానికి ఫీల్డ్ మేనేజర్లు, పశువైద్యులు, ఫ్రంట్ లైన్ సిబ్బంది తో ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఒక టాస్క్ ఫోర్స్/రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలి.
5.ఏదైనా కేసును గమనించినట్లయితే, దానిపై సత్వరమే చర్య తీసుకునేందుకు వీలుగా ఒక నోడల్ అధికారి పర్యవేక్షణలో 24 గంటలు పనిచేసే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
6.జంతువులకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అత్యవసర చికిత్స అందించి, అవి తిరిగి వాటి సహజ ఆవాసాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి.
7.వివిధ విభాగాల సమన్వయ కృషి ద్వారా వ్యాధి నిఘా, మ్యాపింగ్, పర్యవేక్షణ వ్యవస్థలను మెరుగుపరచాలి.
8.జాతీయ పార్కులు/అభయారణ్యాలు/టైగర్ రిజర్వులలోనూ, చుట్టుపక్కలా సిబ్బంది/పర్యాటకులు/ గ్రామీణుల కదలికలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఇతర నిబంధనలను పాటించాలి.
9.వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన ఇతర చర్యలను పాటించాలి.
10.తీసుకున్న చర్యలను పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి.