లాక్ డౌన్ వ్యవసాయం/వీడియో కాన్ఫరెన్స్

దేశంలో లాక్ డౌన్ సమయంలో చేపడుతున్న వ్యవసాయ పనుల గురించి, వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖల కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆదేశాల మేరకు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో పనిచేసే రైతులు, ఇతర కార్మికులు తమ కార్యకలాపాలను ఎటువంటి ఇబ్బందులు పడకుండా కొనసాగించుకునేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాలకు ప్రభుత్వం మంజూరు చేసిన మినహాయింపులను తప్పనిసరిగా అమలుచేయాలని మంత్రి తోమర్ పిలుపునిచ్చారు. వివిధ మినహాయింపులు, సడలింపులను పర్యవేక్షించేందుకు నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

కోవిడ్-19 వ్యాప్తిని అదుపు చేయాలనే ఉద్దేశ్యతో విధించిన 21 రోజుల లాక్ డౌన్ కారణంగా రైతులు ప్రారంభంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో మంత్రి తోమర్, కేంద్ర హోం మరియు ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపి, రైతులకు అవసరమైన సహాయ చర్యలను వెంటనే అమలుచేయడం జరిగింది. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రులు పురుషోత్తం రూపాల మరియు కైలాష్ చౌదరీ లతో కలిసి మంత్రి తోమర్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు, ఆదేశాల అమలును సీనియర్ అధికారులతో సమీక్షించారు.

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు మంజూరు చేసిన మినహాయింపులు, సడలింపులు అమలుచేసేటప్పుడు, సామాజిక దూరం పాటించడంలో నియమాలను రైతులు తప్పని సరిగా పాటించేటట్లు అధికారులు చూడాలని శ్రీ తోమర్ నొక్కి చెప్పారు. పంటలు కోసేటప్పుడు రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని మంత్రి పేర్కొన్నారు. రైతులు తమ ఉత్పత్తులను రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలకూ రవాణా చేసేటప్పుడు ఎటువంటి అడ్డంకి లేకుండా చూడడంతో పాటు, రైతులు తమ ఉత్పత్తులను, తమ పంట పొలాలకు సమీపంలో విక్రయించుకోడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఈ విషయంలో వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసే వాహనాలకు తగిన మినహాయింపులు మంజూరు చేయడం జరిగింది. పంటలను విత్తే కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని మంత్రి చెప్పారు. ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కూడా, ఎటువంటి ఇబ్బందీ కలగకుండా చూడాలని ఆయన కోరారు.

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కార్యకలాపాలతో పాటు ఎం.ఎస్.పి. కార్యకలాపాలలో నిమగ్నమైన సంస్థలను ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల నుండి మినహాయించింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన “మండీలు”; పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు, రైతు కూలీలు; వ్యవసాయ యంత్రాలకు సంబంధించిన “కస్టమ్ హైరింగ్ కేంద్రాలు (CHC) లు; ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు తయారీ మరియు ప్యాకింగ్ యూనిట్లు, రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ, కోత యంత్రాలు, విత్తన యంత్రాలు వంటి వ్యవసాయ, ఉద్యానవన పరికరాల రవాణా లను కూడా ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల నుండి మినహాయించింది. వ్యవసాయం, ఉద్యానవనాలకు సంబంధించిన పంపిణీదారులు కూడా మినహాయించిన జాబితాలో చేర్చడం జరిగింది. వ్యవసాయ యంత్రాలు, వాటి విడి భాగాల దుకాణాలతో పాటు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కు అనుకూలంగా పెట్రోలు పంపుల వద్ద, జాతీయ రహదారలపైనా ఉండే ట్రక్ రిపేరు షాపులు కూడా తెరిచే ఉంటాయి. అదే విధంగా, తేయాకు తోటలతో పాటు, టీ పరిశ్రమ గరిష్టంగా 50 శాతం కార్మికులతో పని చేయవచ్చు.

కోవిడ్-19కు వ్యతిరేకంగా సమర్ధంగా పోరాడే చర్యలో భాగంగా మండీల్లో రద్దీని తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల, తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి వ్యక్తిగతంగా మండీలకు రావలసిన అవసరం లేకుండా చేసేందుకు, రైతుల వ్యవసాయ మార్కెటింగును మరింత పటిష్టపరిచేందుకూ, ప్రస్తుతం అమలులోఉన్న జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) వ్యవస్థకు కొత్త లక్షణాలను జోడించడం జరిగింది. మూడు లక్షల వరకు ఉన్న స్వల్ప కాల పంట రుణాలపై 2020 మార్చి 1వ తేదీ నుండి 2020 మే 31 వ తేదీ మధ్య చెల్లించవలసిన వాయిదాల గడువును 2020 మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. వాయిదా గడువు పెంచిన తేదీ వరకు రైతులు ఎటువంటి జరిమానా లేకుండా కేవలం 4% వడ్డీ తో తమ రుణాలను తిరిగి చెల్లించవచ్చు.