కరోనా కారణంగా ఆగిన ‘అఖండ’, వచ్చేనెల నుంచి మళ్లీ సెట్స్ పైకి

కరోనా కారణంగా ఆగిన ‘అఖండ’, వచ్చేనెల నుంచి మళ్లీ సెట్స్ పైకి

బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలు సంచలన విజయాలను అందుకోవడమే అందుకు కారణం. మూడో సినిమాగా ‘అఖండ’ రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో విభిన్నమైన లుక్స్ తో బాలకృష్ణ కనిపించనున్నారు. ఈ పాటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావలసింది. కరోనా కారణంగా షూటింగును ఆపవలసి వచ్చింది. మళ్లీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారడంతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.తాజా షెడ్యూల్లో బాలకృష్ణ తదితరులపై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారట. జులై మొదటివారం నుంచి హైదరాబాద్ శివార్లలో ఈ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని చెబుతున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ తో చాలావరకూ చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు. అధికారికంగా చెప్పకపోయినా, దసరాకి ఈ సినిమా విడుదలవుతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, పూర్ణ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది.