ట్రంప్ వల్లే క్యాపిటల్ హిల్ అల్లర్లని ఆరోపణ

ట్రంప్ వల్లే క్యాపిటల్ హిల్ అల్లర్లని ఆరోపణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో షాక్ తగిలింది. క్యాపిటల్ హిల్ (అమెరికా చట్టసభ)లో విధులు నిర్వర్తించే ఇద్దరు అధికారులు ఆయనపై దావా వేశారు. జనవరి 6న క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడిలో తన సహచర అధికారులు తీవ్రంగా గాయపడ్డారని, ఒకరు చనిపోయారని, దానికి కారణం ట్రంపేనని పేర్కొంటూ మంగళవారం ఫెడరల్ కోర్టులో దావా వేశారు. నాడు జరిగిన అల్లర్లలో అందరం శారీరక, మానసిక క్షతగాత్రుల్లా మిగిలిపోయామని పిటిషన్ వేసిన అధికారులు జేమ్స్ బ్లాసిం గేమ్, సిడ్నీ హెంబీలు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఆయన మద్దతుదారులు క్యాపిటల్ హిల్ పై దాడికి ఒడిగట్టారని పేర్కొన్నారు. ‘‘ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ట్రంప్.. ఎన్నెన్నో ఆరోపణలు చేశారు. తనను బలవంతంగా వైట్ హౌస్ నుంచి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేశారు. ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు’’ అని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. దాడి చేసిన ముఠాను ట్రంప్ ప్రోత్సహించారని, హింస జరిగేలా ప్రేరేపించారని, వారికి సాయం అందించారని ఆరోపించారు.తన తల, నడుముకు గాయాలతో పాటు మానసికంగా కూడా గాయపడ్డానని బ్లాసింగేమ్ అన్నారు. దాడి చేసే టైంలో తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారని ఈ ఆఫ్రికన్ అమెరికన్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. క్యాపిటల్ బిల్డింగ్ డోర్ల కింద నలిగి హెంబీ మోకాళ్లు విరిగాయి. ఇద్దరికీ 75 వేల డాలర్ల (సుమారు రూ.55 లక్షలు) చొప్పున పరిహారం ఇప్పించాలని ఇద్దరు అధికారులు కోర్టును కోరారు.