మన దేశ కామధేనువు FCI

కోవిడ్‌-19 దిగ్బంధం నడుమ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఆహారధాన్యాల సరఫరాలో భారత ఆహార సంస్థ (FCI) చొరవ చూపింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద జాతీయ ఆహారభద్రత చట్టం (NFSA) పరిధిలోగల లబ్ధిదారులకు 3 నెలలపాటు తలసరి 5 కిలోల ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ దిశగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆహారధాన్యాలను అందుబాటులో ఉంచేందుకు ఎఫ్‌సీఐ నిరంతరం శ్రమిస్తోంది.

ఈ మేరకు 24.03.2020 నుంచి 07.04.2020 వరకు 15 రోజుల వ్యవధిలో 721 గూడ్సు రైళ్లద్వారా 18.42 లక్షల టన్నుల ఆహారధాన్యాలను రాష్ట్రాలకు చేరవేసింది. దిగ్బంధానికి ముందు రోజుకు సగటున 0.8 లక్షల టన్నులు రవాణా అవుతుండగా, గడచిన 15 రోజుల్లో 1.44 లక్షల టన్నుల వంతున చేరవేయడం గమనార్హం. కాగా, PMGKAY కింద ఇప్పటికే 13 రాష్ట్రాలు ఎఫ్‌సీఐ నుంచి ఆహారధాన్యాలను తీసుకోవడం ప్రారంభించగా, మిగిలిన రాష్ట్రాలు కూడా సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఆహారధాన్యాలతో పిండి, ఇతర ఉత్పత్తుల తయారీదారుల అవసరాలపై ఆయా జిల్లా కలెక్టర్ల అంచనాల ప్రకారం ఎఫ్‌సీఐ గోధుమలను, బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఈ మేరకు ఇప్పటిదాకా 13 రాష్ట్రాలకు 1.38 లక్షల టన్నుల గోధుమలను, 8 రాష్ట్రాలకు 1.32 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది.