ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు ఆంక్షల సడలింపు

అనంతపురం జిల్లాలో గత 5రోజుల నుంచి 9695.5 టన్నుల ఉద్యాన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ గంధంచంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గత ఐదు రోజుల నుంచి 7,885 టన్నుల అరటి, 460 టన్నుల టమోటా, 615 టన్నుల మేలన్స్, 2.4టన్నుల పువ్వులు,
28 టన్నుల ద్రాక్ష, 75 టన్నుల మామిడి, ఇతర కూరగాయలు 630 టన్నులు మార్కెట్ చేయడం జరిగిందన్నారు. అరటి, చినీ, జామ, బొప్పాయి, మామిడి, కర్బూజా తదితర పంటలకు సంబంధించి కోతలు చేపట్టేందుకు, సరిహద్దులలో ఉద్యాన ఉత్పత్తుల రవాణా వాహనాలకు సంబంధించి ఆంక్షలు వుండకూడదని పోలీసులకు ఇదివరకే ఆదేశాలు జారీ చేశామని అనంతపురం జిల్లా కలెక్టర్ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 2.02లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు ఉండగా, 58లక్షల టన్నుల ఉత్పత్తులు ఏటా దిగుబడి అవుతున్నాయని తెలిపారు. ఏప్రిల్ నెలాఖరుకు జిల్లాలో అరటి 1.46 లక్షల టన్నులు, చీని 1.20 లక్షల టన్నులు, జామ 2,200, నిమ్మ 1248 టన్నులు, బొప్పాయి 42 వేల 300 టన్నులు, మామిడి 25,840 టన్నులు, కర్బూజ 3940 టన్నులు, కలింగడ 3,600 టన్నులు, సపోటా 5,400 టన్నులు, టమోటా 75 వేల టన్నులు, పచ్చి మిరప 3 వేల టన్నులు, ఉల్లి 900 టన్నులు, బెండ 5,872 టన్నులు కోతకు సిద్ధంగా ఉండగా, ఆయా పంటలకు మార్కెటింగ్ చేయడం జరుగుతుందన్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభం నుంచి జిల్లా రైతులను బయటపడేసేందుకు ఉపశమనం కలిగించే ప్రయత్నం లో భాగంగా ఉద్యాన ఉత్పత్తుల కోత తో పాటు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తర భారత రాష్ట్రాలు, కర్ణాటక, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు ఉద్యాన ఉత్పత్తుల వాహనాల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లావ్యాప్తంగా రైతుల సహాయార్థం క్షేత్రస్థాయిలో ఉద్యాన, మార్కెటింగ్ శాఖ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో మార్కెటింగ్, ఉద్యాన, వ్యవసాయ, పోలీసు శాఖల ఉద్యోగులు సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఏవైనా సమస్యలు ఎదురైతే కాల్ సెంటర్ నెంబర్ 08554 – 275805 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1902 కు ఫోన్ చేయాలని తెలిపారు.