కరోనాపై ఏపీ ప్రభుత్వం అలుపెరగని పోరాటం

*విజయవాడలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌*
*కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి 24 గంటలూ సేవలు*
*కాల్‌ వచ్చిన గంటలోనే రంగంలోకి 21 ప్రభుత్వ శాఖలు*
*కరోనా కట్టడితోపాటు ప్రజావసరాలు తీర్చేందుకు చర్యలు*
*రైతుల ఇబ్బందులు తొలగించడంలోనూ అదే స్పందన*

కంటికి కనిపించని కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అలుపెరుగని పోరాటం చేస్తోంది. లాక్‌డౌన్‌ తరుణంలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా స్పందించేలా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ 24 గంటలూ పనిచేస్తోంది. డయల్‌ 1902 కు కాల్‌ వచ్చిన గంటలోనే ప్రత్యేక బృందాలు కార్యరంగంలోకి దిగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి 21 ప్రభుత్వ శాఖలను ఒకే చోటకు చేర్చడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. రోజుకు సగటున వెయ్యికిపైగా కాల్స్‌ వస్తున్నాయి. వీటిలో చాలా వరకు ప్రజలకు అత్యవసర సేవలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఒక వైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రజావసరాలు తీర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు ఐజీలు, ఇద్దరు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, అనేక మంది పోలీస్‌ సిబ్బంది కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పరిధిలో పనిచేస్తున్నారు.

*గంటలోనే పరిష్కారం*
కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 1902కి కాల్‌ వచ్చిన గంటలోనే సమస్య పరిష్కరిస్తున్నామని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఐజీ హరికుమార్‌ చెప్పారు. అంతర్‌ రాష్ట్ర, అంతర్‌ జిల్లాల నుంచి వచ్చే కాల్స్‌ని కూడా వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వ సూచన మేరకు ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలి. ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సేవలను ప్రభుత్వ యంత్రాంగం అందిస్తుందని ఆయన చెప్పారు.

*ఇలా స్పందిస్తున్నారు..*

► లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపైకి జనం ఎక్కువగా వచ్చినా, వాహనాలు నిలిచిపోయినా, సరిహద్దుల్లో రద్దీ ఉన్నా, ఎక్కడైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా ఆయా ప్రాంతాల్లోని యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తక్షణ చర్యలు చేపడుతున్నారు.

► పొరుగు ప్రాంతంలో చిక్కుకున్నామని, తమ ఊరికి వెళ్లే అవకాశం కల్పించాలని అనేక మంది కోరడంతో రాష్ట్ర సరిహద్దుల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసి వైద్య పరీక్షలతో అనుమతించిన సందర్భాలున్నాయి. కరోనా తీవ్రతపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.

► నిత్యావసర సరుకులు అందకపోవడం, ధరలు అందుబాటులో లేవనే ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా స్టాల్స్‌ విస్తారంగా ఏర్పాటు చేసి అధిక ధరలను నియంత్రించింది. ఈ విషయంలో జిల్లాల్లోనూ జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

► ఆక్వా ఉత్పత్తులు, పంటలను మార్కెట్టుకు తెచ్చే విషయంలో పడుతున్న ఇబ్బందులను తొలగించే చర్యలు తీసుకుంటున్నారు.