మీడియాకు అనుమతి.
దేశంలో లాక్డౌన్ అమలు జరుగుతోన్న సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న మీడియా సిబ్బందికి మినహాయింపును ఇస్తూ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్రం లేఖ రాసింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మీడియా సహకరించాలని కరోనాపై విస్తృత ప్రచారం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం మీడియా అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీడియాపై ఎలాంటి
ఆంక్షలు లేవు. ఎక్కడైనా తిరిగేందుకు అనుమతి ఇస్తున్నారు.
ఏపీ లాక్డౌన్ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ మీడియా పై ఎలాంటి ఆంక్షలు లేవు.. వారు ఎక్కడైనా తిరిగేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
కొవిడ్-19 విజృంభన నేపథ్యంలో ప్రసార మాధ్యమాల సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా నిర్మూలనకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని, అయితే అదే సమయంలో వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం ఆ ప్రకటనలో అభిప్రాయపడింది.
టీవీ చానెళ్లు, న్యూస్ ఏజెన్సీలు, టెలీపోర్ట్ ఆపరేటర్లు, డీఎస్ఎన్జీలు, డీటీహెచ్లు, ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్లు, ఎఫ్ఎం రేడియోలు, కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర సమాచార శాఖ తన ప్రకటనలో పేర్కొన్నది. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోపాటు కరోనా నిర్మూలన కోసం ప్రజలకు అవసరమైన ముఖ్య సందేశాలను ప్రసారం చేయాలని సూచించింది. అదే సమయంలో తప్పుడు వార్తలు, ప్రజలను భయాందోళనలకు గురిచేసే వార్తలకు దూరంగా ఉండాలని కోరింది.
కరోనాపై ప్రజలను అలర్ట్ చేయడంలో ప్రసార మాధ్యమాలది కీలకపాత్ర అయినందున ఆయా నెట్‌వర్క్‌లకు ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, యూటీల సీఎస్‌లను కేంద్రం కోరింది. మీడియా ప్రతినిధుల రాకపోకలకు ఆటంకం కలిగకుండా చర్యలు తీసుకోవాలని.. వారి వాహనాలకు ఇంధనం కొరత రాకుండా చూడాలని.. న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లకు సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్‌లు, ఇతర న్యూస్ నెట్వర్క్ కార్యాలయాలకు విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని సీఎస్‌లకు కేంద్రం సూచించింది.