కేంద్రంతో కలిసి కదం తొక్కుతాం: కమీషనర్ భావన సక్సేనా

కరోనా విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర అధికారులతో సమన్వయం. ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ శ్రీమతి భావన సక్సేనా

కరోనా వైరస్ వల్ల ఎదురవుతోన్న పరిస్థితులను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నిత్యావసర సరుకుల కేటాయింపు, నిధులు విడుదల, రైతులను ఆదుకొనేందుకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించుటలో ఆంధ్ర ప్రదేశ్ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయంతో పనిచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను సంక్షేమం కోసం పని చేస్తామని AP భవన్ రెసిడెంట్ కమీషనర్ శ్రీమతి భావన సక్సేనా స్పష్టం చేశారు.

ఢిల్లీలో క్వారంటైన్ పూర్తయి నెగెటివ్ వచ్చిన తెలుగు రాష్ట్రాల వ్యక్తులను స్వస్థలాలకు పంపే అంశంపై కేంద్ర హోం శాఖ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్
భావన సక్సేనా సంప్రదింపులు జరిపారు. ఓ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారందరినీ తరలించాలని కేంద్ర హోం శాఖ, డిజిసీఎకు విజ్ఞప్తి చేసారు. ఏమైనా సమస్యలు ఉంటే apbhavancovid19@gmail.comకు మెయిల్ చేయాలని విజ్ఞప్తి.

కరోనా వైరస్ నివారణ, కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల కావలసిన నిధులు, నిత్యావసర సరకుల కేటాయింపు, ఆంధ్ర ప్రదేశ్ లో పండించే అరటి, మామిడిపండ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి, మార్కెటింగ్ సదుపాయాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయానికి న్యూ ఢిల్లీ లోని AP భవన్ అధికారులతో రెసిడెంట్ కమీషనర్ శ్రీమతి భావన సక్సేనా తన ఛాంబర్లో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమీక్షించి పలు సూచనలు చేశారు.

కరోనా వైరస్ విపత్కర పరిస్థితులను అధికమించేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలను ఆదుకొనేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పంపిణి చేయుటకు అవసరమైన నిత్యావసర సరుకులు, కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ లకు రాసిన లేఖపై సంభందిత మంత్రిత్వల శాఖల కేంద్ర అధికారులతో సమన్వయం చేస్తూ సత్వర కేటాయింపులు, సరఫరాలకు కృషిచేస్తున్నట్లు ఆమె తెలిపారు.

మహారాష్ట్ర నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు సరఫరా చేస్తున్న కందిపప్పు, ఉల్లిపాయల కేటాయింపును పెంచి నిర్ణీత ధరకే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కందిపప్పు, శనగపప్పు కొనుగోలు, సేకరణలో NAFED నియమనిబంధనలు సడలించి సేకరించాలని కోరినట్లు చెప్పారు.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం క్రింద నిరుపేద కుటుంబాలవారికి సరఫరా చేస్తున్న బియ్యం సరఫరాను పెంచాలని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్ర ప్రదేశ్ పౌరసరఫరాల శాఖకు విడుదల చేయాల్సిన సబ్సిడీ బకాయిలను ప్రస్తుత ఆర్ధిక మాంద్యాన్ని పరిగణలోనికి తీసుకొని సత్వరమే విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదుకొనుటలో సహకరించాలని విజ్నప్తి చేసినట్లు శ్రీమతి భావన సక్సేనా వివరించారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో DRDO., HLL Life Care, ప్రైవేట్ రంగములోని మందుల కంపెనీల ద్వారా సమకూరిన కరోనా నివారణ మాస్కులు
(N 95, triple layer masks), శానిటైజర్స్, మందులను పౌరవిమానయాన శాఖ ద్వారా కార్గో ఫ్లైట్స్ లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, విజయవాడ నగరంకు పంపించినట్లు శ్రీమతి భావన సక్సేనా తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ లో పండించి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న అరటిపండ్ల ధర ప్రస్తుత విపత్కర పరిస్థితులలో మెట్రిక్ టన్ను 12వేల రూపాయల నుండి 3వేల రూపాయలకు పడిపోయిందని, ఆంధ్ర ప్రదేశ్ రైతులు నష్టపోకుండా వారిని ఆదుకొనేందుకు ఎగుమతి, తగిన మార్కెటింగ్, గిట్టుబాటు ధర కల్పించ వలసినదిగా కేంద్ర అధికారులను అభ్యర్ధించినట్లు తెలిపారు. మరో వారం రోజులలో మామిడిపండ్లు ఎగుమతి సీజన్ ప్రారంభంకానున్నందున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి ఢిల్లీ లోని ప్రముఖ వ్యాపార కేంద్రం ఆజాద్ పూర్ మండికి, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి, మార్కెటింగ్ సదుపాయం, గిట్టుబాటు ధర కల్పించవలసినదిగా కోరినట్లు కూడా పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ, పౌరసరఫరాలు, పౌరవిమానయాన శాఖ కార్యదర్శులు, అధికారులు ప్రతిరోజూ రెండు దఫాలుగా నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి అందవలసిన సహాయ సహకారాలను వారి దృష్టికి తీసుకుని వెళుతున్నట్లు రెసిడెంట్ కమీషనర్ శ్రీమతి భావన సక్సేనా చెప్పారు.

ఫిలిఫైన్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అనంతపురం జిల్లాకు చెందిన ఇరువురు విద్యార్థుల మృతదేహాలను ఆంధ్రప్రదేశ్ కు రప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు, EMBASSY అధికారులతో చర్చించినట్లు ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ శ్రీమతి భావన సక్సేనా వెల్లడించారు.