APలో మత్స్యకారులకు మహర్ధశ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 8 ఫిషింగ్‌ హార్బర్లు, ఓచోట ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణంకు సర్కారు సిద్ధమవుతోంది. 9చోట్ల చేపల వేటకు చక్కటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చుతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫిషింగ్‌ హార్బర్లపై సీఎం CM జగన్‌ సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళంలో రెండు, విశాఖపట్నంలో 1, తూర్పు గోదావరిలో1, పశ్చిమ గోదావరిలో1, కృష్ణాజిల్లాలో1, గుంటూరులో1, ప్రకాశం జిల్లాలో1, నెల్లూరులో ఒకటి చొప్పున నిర్మాణం చేయబోతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో బడగట్లపాలెంలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం., విశాఖపట్నం జిల్లా పూడిమడకలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, తూగో జిల్లా ఉప్పాడలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, పగో జిల్లా నర్సాపురంలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మేజర్‌ షిఫింగ్‌ హార్బర్‌, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌లను నిర్మించనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఎవ్వరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలసపోకూడదని, రెండున్నర మూడు సంవత్సరాల వ్యవధిలో వీటిని పూర్తిచేయాలని, గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం మూడు ఫిష్‌ ల్యాండింగ్‌ ఫెసిలిటీస్‌ మాత్రమే ఇచ్చారని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు.

గుండాయిపాలెం (ప్రకాశం), అంతర్వేది, ఓడలరేవు (తూ.గో)లకు కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని, ఇప్పుడు దాదాపు రూ.3000 కోట్లు ఖర్చుచేసి 8 ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ ల్యాండ్‌ కట్టబోతున్నామని ముఖ్యమంత్రిగా మీరు కల్పిస్తున్న అవకాశాలు మత్స్యకారుల జీవితాల్లో మంచి మార్పులను తీసుకు వస్తాయని మంత్రి అన్నారు. చేపలవేట పెరగడమే కాదు, వారికి ఆదాయాలు పెరిగేందుకు దోహదపడుతుందని, ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న కార్యక్రమాలను మత్స్య కారులు ఎవ్వరూ మరిచిపోలేరని సమావేశంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ సహా ఇతర అధికారులు అభిప్రాయబడ్డారు.