APలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంటల విషయంలో రైతులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలు.
టమోటో: కోవిడ్-19 అనంతర పరిస్థితుల కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. మదనపల్లె, పుంగపూరు. పలమనేరు, మొలకల చెరువు మార్కెట్లలో ప్రభుత్వం జోక్యంచేసుకుని రైతు బజార్ల ద్వారా పంపిణీచేస్తోంది. ఇప్పటివరకూ వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ 5వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు.
టమోటాను అతితక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ వచ్చిన కథనాలపై అధికారులు దృష్టిపెట్టారు. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్ యార్డులో మోడల్ ధర రూ. 6.40గా ఉంది.
జాక్‌పాట్, కమీషన్లు పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే.. కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈమేరకు మార్కెటింగ్ అధికారులకు, సంబంధిత రెవిన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.
అరటి: లాక్ డౌన్ కారణంగా అరటి పంటకు తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతికి ఉద్దేశించిన అరటికి సంబంధించి రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతోపాటు, మార్కెట్లు మూసివేయబడ్డాయి. అయినా సరే.. తీవ్ర ప్రయత్నాలు చేసి అతికష్టమ్మీద రవాణాను ప్రత్యేక చర్యల ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చాం. దాదాపు 10వేల టన్నులు అరటి అనంతపురం, వైయస్సార్ కడప జిల్లాలనుంచి మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోలుచేసి రైతు బజార్ల ద్వారా మరియు మహిళా సంఘాల ద్వారా స్థానిక మార్కెట్లకు కనీస ధరలకు వినియోగదారులకు అందించాం.
ప్రస్తుతం అరటి ఎగుమతులు ప్రారంభం అయ్యాయి. ధరలు కూడా టన్నుకు రూ. 6వేల వరకూ చేరుకుంటోంది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో … రవాణా ఆశాజనకంగా ఉంటుంది.
పంటలపైనా దృష్టి: కొద్దిరోజుల్లో మార్కెట్లోకి రానున్న మామిడి, బత్తాయి లాంటి పంటలపైన కూడా అధికారులు దృష్టి సారించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం.
మొక్కజొన్న: మొక్కజొన్న కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకూ 10వేల టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. రైతులకు చెల్లింపులు కూడా పదిరోజుల్లో పూర్తిచేస్తాం.
ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు: రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ఆక్వా ఉత్పత్తులు అధిక భాగం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. లాక్డౌన్ వల్ల అక్కడ మార్కెట్లు తెరిచేందుకుగాను, అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా అసోం సీఎంతో మాట్లాడారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుత సడలింపుల కారణంగా ఎగుమతులు మొదలయ్యాయి. బెంగాల్, యూపీ, బీహార్, అసోంలకు ఎగుమతి ప్రారంభమైందని వై. మధు సూదన్ రెడ్డి, ఐఎఫ్ఎస్, ప్రభుత్వ కార్యదర్శి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తెలిపారు.