స్థానిక సంస్థల ఎన్నికల్లో అల్లర్లపై ఈసీ సీరియస్

స్థానిక సంస్థల ఎన్నికల్లో అల్లర్లపై ఈసీ సీరియస్

స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని… సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తూ చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైంది. అవసరమైతే కొత్త షెడ్యూల్ తీసుకునేందుకు కూడా వెనుకాడబోమంటూ హెచ్చరించారు.

స్థానిక సంస్థల ఎన్నకల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలపై దాడి, నామినేషన్లు దాఖలు చేస్తున్న వారిని అడ్డుకోవడం సహా పత్రాలు లాక్కున్న ఘటనలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ప్రధానంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఘటనలను అత్యంత హింసాత్మక ఘటనలుగా ఈసీ పరిగణిస్తోంది.

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కారుపై దాడి చేసిన ఘటనను అత్యంత హింసాత్మక ఘటనలుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాల్సిన పరిస్థితుల్లో కొంతమంది అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించడం దారుణమన్నారు. గుంటూరు, చిత్తూరులో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటుకు సిఫారసు చేశారు.

తిరుపతి, మాచర్ల, పుంగనూరులో ఘర్షణలపై విచారణకు ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ఆదేశించారు. తిరుపతి, పుంగనూరు, మాచర్లలో పరిస్థితులను నిశితంగా పరిశిస్తున్నామన్నారు. ఈ మూడు చోట్ల కొత్త షెడ్యూల్‌ కు వెనకాడబోమని హెచ్చరించారు. మహిళలు, బలహీనవర్గాలపై దాడులు అత్యంత శోచనీయమన్నారు. వలంటీర్లపై ఆరోణల విషయంలో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

స్థానిక ఎన్నికల ప్రక్రియలో హింసాత్మక ఘటనలు జరగటం బాధాకరమన్నారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడం అనివార్యంగా భావిస్తున్నామన్నారు. మాచర్ల దాడిలో పాల్గొన్న నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారని…. స్థానిక పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందన్నారు. ఘటనకు బాధ్యుడిగా మాచర్ల సీఐ రాజేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలపై కూడా వేటు వేశారు. కరోనా హెచ్చరికల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 6 వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపింది.