గూగుల్ నుంచి బయటకు వచ్చిన ఏఐ శాస్త్రవేత్తకు యాపిల్ ఆహ్వానం

గూగుల్ నుంచి బయటకు వచ్చిన ఏఐ శాస్త్రవేత్తకు యాపిల్ ఆహ్వానం

గూగుల్ శాస్త్రవేత్త, తన సహచరులను ఉద్యోగం నుంచి తొలగించారన్న ఆగ్రహంతో సంస్థకు రాజీనామా చేసిన సామీ బెంగియోను తమ సంస్థలోకి తీసుకున్నట్టు యాపిల్ ఐఎన్సీ ప్రకటించింది. గూగుల్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ విభాగాన్ని నడిపించిన సామీ, కొంతకాలం క్రితం తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన్ను యాపిల్ కొత్త ఏఐ రీసెర్చ్ యూనిట్ కు అధిపతిగా తీసుకున్నామని, ఆయన తమ సంస్థలో మెషీన్ లెర్నింగ్, ఏఐ స్ట్రాటజీ విభాగాలకు హెడ్ గా ఉన్న జాన్ గియన్నాడ్రియా నేతృత్వంలో విధులు నిర్వహిస్తారని సంస్థ వర్గాలు వెల్లడించాయి.కాగా, గియన్నాడ్రియా కూడా గూగుల్ నుంచే యాపిల్ కు రావడం గమనార్హం. దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు గూగుల్ కు సేవలందించిన ఆయన, 2018లో యాపిల్ లో చేరారు. అయితే, ఈ తాజా పరిణామాలపై స్పందించేందుకు యాపిల్ నిరాకరించగా, సామీ బెంగియో అందుబాటులో లేరు. సుమారు 14 సంవత్సరాల పాటు గూగుల్ లో పని చేసిన ఆయన, గత వారమే రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయనకు యాపిల్ లో స్థానం లభించడం గమనార్హం. ఇదిలావుండగా, తన సహచర శాస్త్రవేత్తలైన మార్గరెట్ మిచెల్, టిమ్నిట్ గెబ్రూలను గూగుల్ తొలగించగా, ఆగ్రహించిన ఆయన సంస్థకు రాజీనామా చేశారని తెలుస్తోంది. సంస్థకు చెందిన ఎలక్ట్రానిక్ ఫైల్స్ ను బయటకు తరలించారన్న ఆరోపణలు మార్గరెట్ పై వచ్చాయి. దీంతో ఆమెను తొలగించినట్టు ఇటీవల గూగుల్ ప్రకటించింది. వీరిద్దరితో కలిసి బెంగియో గూగుల్ కు కృత్రిమ మేథస్సు విభాగంలో ఎంతో సేవలందించారు. ఇప్పుడు వీరిద్దరు కూడా యాపిల్ లో చేరుతారని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.