#AskKTR కరోనా న్యూస్ టైం

మంత్రి కె. తారక రామారావు ట్విట్టర్ లో ఆస్క్ కేటీఆర్(#AskKTR) పేరిట నిర్వహించిన సంభాషణ

• ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తుందని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అపేందుకు లాక్ డౌన్ ను మరి కొంత కాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే ప్రభుత్వంలోని ఇతర భాగస్వాములతో కలిసి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తమ శక్తిమేరకు కృషి చేస్తున్నాయన్నారు. వైరస్ కట్టడి కోసం పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు మరియు ఇతర రంగాలకు చెందిన ప్రతి ఒక్కరి పైన ప్రజలకు ప్రత్యేకంగా గౌరవభావం ఏర్పడడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ ద్వారా ప్రజల్లో స్వయం క్రమశిక్షణ ఏర్పడిందని దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని కోరారు. లాక్ డౌన్ మెదలయిననాటి నుంచి పుట్టిన పసిపాపల కి వ్యాక్సిన్ ని ప్రభుత్వం ఇంటివద్దనే వేసే అంశానికి సంబంధించిన విషయాన్ని నిన్ననే మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందుతున్న కొన్ని హాట్స్పాట్ లను గుర్తించామని, అలాంటి చోట్ల సామూహిక కరోనా టెస్టులను చేయడం ద్వారా ఫలితాలు ఉండే అవకాశం ఉందని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో చాలా మంది తమ కుటుంబాలకు దూరంగా ఉన్నారని ఎవరైనా ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఇరుక్కుపోతే దాన్ని గుర్తుంచుకొని లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రస్తుత కరోనా సంక్షోభం వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం వంటి కీలకమైన అంశాలపై అందరికీ ఒక పాఠం నేర్పిందని, దీంతో పాటు అవసరమైన మేరకు వైద్య మౌలిక వసతులు, సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో వైరస్ వ్యాప్తి కట్టడి చేసేందుకు కృషి చేస్తున్న వారి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం అందరికీ తెలిసిందన్నారు.

• కరోనా వైరస్ కి వాక్సిన్ దొరికేంత వరకు కి ఇతర దేశాల నుంచి మన దేశంలోకి, మన దేశం నుంచి ఇతర దేశాలకు ప్రజల రాకపోకలను సంపూర్ణంగా నిషేధించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చని ఈ సందర్భంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభ కాలంలో సహాయం ఎంత చిన్నదైనా, ఏలాంటి మార్గంలో అయినా చేయడం మంచిదని ఇందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. ప్రస్తుతం సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా దన్యవాదాలు తెలిపారు.

• కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయపడిన తర్వాత మరింత అత్యుత్తమ వైద్య మౌలిక సదుపాయాల వైపు ప్రపంచం దృష్టి సారించాల్సి ఉంటుందని, తద్వారా భవిష్యత్తులో ఏదైనా వైరస్ ఎదురైతే అడ్డుకోగలుగుతుందన్నారు. ప్రస్తుత సంక్షోభం తర్వాత ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతను మార్చుకొని వైద్య రంగానికి మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నదన్నారు. ప్రస్తుత సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాలకి ఒక కనువిప్పు లాంటిదని, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఈ రోజు ఇదే విషయాన్ని గుర్తించాయాన్నారు.

• విద్యార్థుల పరీక్షల గురించి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారని అయితే ప్రస్తుతం ఉన్నది సంక్షోభ సమయమన్న మంత్రి, ఇలాంటి సమయంలో కొంత ఓపిక పట్టాలని సూచించారు. పరీక్షల షెడ్యూల్ కి సంబంధించి ప్రభుత్వం సరైన సమయంలో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్నారు

• ఒకవేళ ప్రపంచమంతా ఒప్పుకుంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పది రోజుల పాటు పరిమిత స్థాయిలో లాక్ డౌన్ ప్రకటిస్తై బాగుంటుందని ఒకరు అడిగిన ప్రశ్నకు తన అభిప్రాయంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుత లాక్ డౌన్ వలన ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న కాలుష్యం మరియు భూ తాపం వంటి అంశాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

• ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ఉద్యోగాన్ని రియలిస్టిక్ అప్రోచ్ లో చేయడం ద్వారానే ఇతరులకి సహాయ పడగలుగుతున్నానని తెలిపారు. తన జీవితంతో పాటు రాజకీయంగా కూడా తనకున్న పరిమితులు తెలుసని అయితే ప్రస్తుతం ఉన్న అధికారం వలన ఎక్కువ మందికి సహాయపడగలుగుతున్నానని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో రాజకీయాలకు అవకాశం లేదని కేటీఆర్ అన్నారు.

• మనసుకు నచ్చిన పనులు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఈ సందర్భంగా కేటీఆర్ కొంతమందికి సమాధానమిచ్చారు

• చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు

• ప్రస్తుత సంక్షోభ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ సమయం పని చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ప్రస్తుత సమయంలో ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ఎక్కువ గంటలు సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడం ద్వారా ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా అని అడిగినప్పుడు నిద్ర సమయం ఉండడం లేదని తెలిపారు. తాను తన టీంతోపాటు వైద్య అరోగ్యశాఖాధికారులతో పనిచేస్తున్నామని తెలిపారు.

• లాక్ డౌన్ నాటి నుంచి మంత్రి కెటియార్ మరియు అయన కార్యాలయం స్పందిస్తున్న తీరుకు, పలువుకి చేస్తున్న సహాయానికి చాల మంది అభినందనలు తెలిపారు