భారత విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం

భారత విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం

భారత్ లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం.. మన దేశం నుంచి వెళ్లే అన్ని విమానాలపై తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ లో కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి వస్తే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ అన్నారు. కాబట్టి మే 15 వరకు భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలనూ నిషేధిస్తున్నామని ఆయన మంగళవారం ప్రకటించారు.ప్రస్తుతం వేలాది మంది ఆస్ట్రేలియన్లు, ప్రముఖ క్రికెటర్లు భారత్ లోనే ఉన్నారని, వాళ్లందరికీ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే, అత్యంత అవసరం ఉన్నవారిని మాత్రం ప్రత్యేక విమానాల్లో ఆస్ట్రేలియాకు తీసుకెళ్తామని ఆయన భరోసా ఇచ్చారు. భారత్ కు అవసరమైనంత సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆక్సిజన్ ట్యాంకులు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం భారత్ భయంకరమైన మానవ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. భారత్ లో పరిస్థితులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు.