ప్రపంచంలో “ఆయుష్” ఫ్యూచర్ సూపర్ పవర్

శతాబ్దాలుగా భారతదేశంలో విశేష ప్రజాదరణ పొందుతున్న ఆయుష్ వైద్య విధానాలకు భారతదేశాన్ని ఆర్ధిక పరంగా సూపర్ పవర్ గా చేయగల అపారమైన సామర్ధ్యం ఉన్నదని, విద్యుత్తు, రోడ్డు రవాణా, రహదారులు, ఎమ్.ఎస్.ఎం.ఈ., శాఖల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

ఆయుష్ రంగం మరింత పురోభివృద్ధి సాధించడానికి పరిశోధన, ఆవిష్కరణల అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఆయుష్, MSME మంత్రిత్వశాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఆయుష్ ఎంట్రప్రెన్యూర్ షిప్ డెవెలప్మెంట్ కార్యక్రమాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, భారతీయ ఆయుర్వేద, హోమియోపతీ, యోగ, సిద్ధా విధానాలను భారీ స్థాయిలో ప్రోత్సహించవలసిన అవసరం ఉందని అన్నారు.

విదేశాలలో భారతీయ ఆయుర్వేద, యోగ, హోమియోపతీ, సిద్ధా వైద్య విధానాలకు విదేశాలలో మంచి డిమాండ్ ఉందని ఆయన అన్నారు. ఈ రంగంలో ప్రస్తుతం ఉన్న సంస్థలు, వ్యక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

ఈ రంగంలో నిష్ణాతులైన వారి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందే నిపుణులద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయర్వేద చికిత్స విధానానికి, యోగాకి ఉన్న భారీ డిమాండును సద్వినియోగం చేసుకోవచ్చునని కూడా ఆయన సూచించారు.సాధారణంగా అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో లభ్యమయ్యే ఆయుర్వేద ముడి సరుకులను సేకరించి, ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించి, ఉపాధి కల్పించాలనీ, స్వయం ఉపాధి పొందాలనీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మన జీవన విధానంలో సమతుల ఆహారం అవసరాన్ని నొక్కి చెప్పే యోగ, ఆయుర్వేద విధానాలకు ప్రాచుర్యం కల్పించాలని గడ్కరీ కోరారు.

ఈ కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) శ్రీపాద యశోనాయక్, MSME సహాయమంత్రి ప్రతాప్ సింగ్ సారంగీ, రెండు మంత్రిత్వశాఖల కార్యదర్శులతో పాటు MSME డెవలప్ మెంట్ కమీషనర్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీపాద యశోనాయక్ మాట్లాడుతూ MSME మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖలు చేస్తున్న కృషిని అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయుష్ ను ప్రోత్సహించడానికి కూడా ఇదే విధమైన సహకారాన్ని కొనసాగించాలని కోరారు. కోవిడ్ -19 మహమ్మారి ని కట్టడి చేయడంలో ఆయుష్ మంత్రిత్వశాఖ చేస్తున్న కృషిని శ్రీ నాయక్ ఈ సందర్భంగా వివరించారు. ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయుష్ రంగాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందనీ, రెండు మంత్రిత్వశాఖలు సమన్వయంతో కృషి చేయాలనీ ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వశాఖ సహాయమంత్రి ప్రతాప్ చంద్ర సారంగీ సూచించారు. MSME ప్రత్యేక కార్యదర్శి & డెవలప్మెంట్ కమీషనర్ రామ్ మోహన్ మిశ్రా తమ ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ, ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వశాఖ లో ప్రస్తుతం ఉన్న పధకాల సహకారంతో ఆయుష్ రంగం అభివృద్ధికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక నేపధ్యాన్ని వివరించారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖలో ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధా, హోమియోపతి వైద్యవిధానాలు ఉన్నాయి. ఆయుష్ ప్రధాన క్లస్టర్లు అహ్మదాబాద్, హుబ్లీ, త్రిసూర్, సోలన్, ఇండోర్, జైపూర్, కాన్పూర్, కన్నూర్, కర్నాల్, కోల్కతా, నాగపూర్ లలో ఉన్నాయి.

ఆయుష్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయుష్ ఆధారిత MSMEలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు వివిధ ఆన్ లైన్ / సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాలద్వారా ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా ప్రసారమైంది.

ఆయుష్ రంగం అభివృద్ధికి రెండు మంత్రిత్వ శాఖలు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. తదనుగుణంగా రెండు మంత్రిత్వ శాఖలు కొన్ని రోజుల క్రితం ఒక అవగాహనా ఒప్పందం పై సంతకాలు చేశాయి.

ఆయుష్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక తయారుచేయడానికి క్షేత్ర స్థాయి అధికారులు ఆయుష్ క్లస్టర్లను అంచనా వేసి, గుర్తించవలసిన అవసరం ఉంది. దిగువ ఉదహరించిన ఎమ్.ఓ. ఎమ్.ఎస్.ఎం.ఈ. పథకాలలో వారికి అవగాహన కల్పించాలి.

*జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ / లీన్ – ఉత్తమ తయారీ పద్ధతులు.
*సేకరణ & మార్కెటింగ్ మద్దతు పధకం – జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనలు, ఎగ్జిబిషన్, జి.ఈ.ఎం., ప్యాకేజింగ్, ఈ-మార్కెటింగ్, ఎగుమతులు.
*ఏ.టి.ఐ. – సామర్ధ్య నిర్మాణం & నైపుణ్యాభివృద్ధి.
*ఈ.ఎస్.డి.పి., ఇంక్యూబేషన్ – అంకురసంస్థలు / సంస్థ అభివృద్ధి.
*క్లస్టర్ల అభివృద్ధి (ఎస్.ఎఫ్.యు.ఆర్.టి. /సి.డి.పి.) – సాంకేతికతను పెంపొందించడం.
*సి.ఎల్.సి.ఎస్., పి.ఎమ్.జి.పి. – ఆర్ధిక మద్దతు.
*సి.ఏ.ఆర్.టి. (వ్యవసాయ గ్రామీణ సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం) డివిజన్ – గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్.
*సాంకేతిక పరిజ్ఞాన కేంద్రాలు (హబ్ & ఏ.ఎమ్.పి; స్పోక్) – ఆయుష్ ఫోకస్డ్ టెక్నాలజీ సపోర్ట్.
*పరీక్షా కేంద్రాలు = నాణ్యత మెరుగుదల/ప్రామాణీకరణ.