లోకాస్సమస్తా సుఖినో భవంతు!

లోకాస్సమస్తా సుఖినో భవంతు!

మొదటే క్లారిటీ కోసం ఒక వివరణ. ఇది ఆస్తిక- నాస్తిక గుణదోష విచారణ కాదు. ముహుర్తాలు, జాతకాలకు సంబంధించి ఒక కోణం.

ఒక శుభ ముహూర్తాన శుభ కార్యానికి ముహూర్తం కుదిరింది. మూఢం, మంగళవారం, అమావాస్య, అర్ధరాత్రి దయ్యాలు డిస్కస్ చేసుకునే టైమ్ లో ఎవరూ కోరి కోరి ముహూర్తం పెట్టమని అడగరు. శ్రావణమాసం, మంచి బహుళ పంచమిలో ముహూర్తం కుదిరితే పంచ భక్ష్య పరమాన్నాలు దొరికినట్లే. కరెక్టుగా రాహువు రోజును పట్టుకునే రాహుకాలం, దున్నపోతుమీద కారు నలుపు బట్టలతో, కాలపాశం చేతబట్టి యముడు వాకింగ్ కు వెళ్లే యమగండం, అంత మంచి టైమ్ కాదు కాబట్టి వర్జించాల్సిన వర్జ్యం, దుర్ముహూర్తం చూసి చూసి ముహూర్తంగా ఎవరూ పెట్టుకోరు కదా? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం- అయిదు కలిపితే పంచ అంగాలు. ముహూర్తానికి ఈ అయిదు ప్రధానం. అందుకే అది పంచ అంగాలుగా పంచాంగం అయ్యింది. మన దురదృష్టం కొద్దీ ఉగాదిరోజు ఆదాయ వ్యయాలు; రాజపూజ్య అవమానాలకు మించి పంచాంగంతో పనిలేకుండా పోయింది. మీడియావారి దిన ఫలాలు రాసేవారికి, చెప్పేవారికి ఉపాధిని కల్పించాయి. పాఠకులను, శ్రోతలను పెంచాయేమో కానీ- ఉగాదిరోజు పార్టీల ఆఫీసుల్లో పంచాంగ శ్రవణాలతో అసలు శాస్త్రం మీదే నమ్మకం పోయింది.

ముహూర్తం దగ్గర నుండే ఒక పాజిటివ్ దృక్పథం, అంతా మంచి జరుగుతుందన్న ఆశ, ఉత్సాహం ఇందులో అండర్ కరెంట్ గా ఉన్న శక్తి.

భవిష్యత్తు బాగుండాలనే ఎవరయినా కోరుకుంటారు. బాగుండడానికి ప్రయత్నిస్తారు. భవిష్యత్తు ముందే తెలిస్తే మజా ఏముంది? సృష్టిలో మరు క్షణం ఏమి జరుగుతుందో తెలియకపోవడమే రహస్యం. వింత. అద్భుతం. ఆశ్చర్యం. కానీ- తెలియని ఆ భవిష్యత్తును తెలుసుకోవాలనే మన ఉబలాటంలో భాగమే జోస్యం. జరిగింది ఎవరయినా చెప్తారు. జరగబోయేది చెప్పడమే గొప్ప.

నీ జాతకమంతా నా దగ్గర ఉంది- అని భయపెడుతూ ఉంటారు. నిజమే. మన జాతకాలు మన చేతుల్లో ఉండవు. తిరిగే గ్రహాల చేతుల్లో ఉంటాయి. ఆ గ్రహాలు మన గ్రహచారం కొద్దీ మన కళ్లకు కనపడవు. ఎన్నో శుక్రవారాలు వస్తుంటాయి. కానీ, మన శుక్ర మహర్దశ ఎప్పుడో మనకు తెలియదు. ఎన్నో గురువారాలు వస్తుంటాయి. కానీ, మన గురు మహర్దశ ఎప్పుడో మనకు తెలియదు. ఎన్నో శని వారాలు వస్తుంటాయి. కానీ, ఎప్పుడూ మనకు ఏలిననాటి శని ఉన్నట్లే ఉంటుంది.

గ్రహ శాంతులు చేసేవారు కొందరు. రంగు రాళ్లు పెట్టుకునేవారు కొందరు. పట్టించుకోకుండా ముందుకు సాగేవారు కొందరు.

గుడ్ లక్. బెస్ట్ విషెస్. ఆశీర్వచనం. కలకాలం చల్లగా ఉండాలి. జీతే రహో. శుభ్ కామనా. భాష ఏదయినా భావం ఒకటే. బాగుండడం. బాగుండాలని కోరుకోవడం.

కరోనా కరాళ నృత్యంతో పుడమి విలవిలలాడుతున్న వేళ- మనం కూడా అందరూ బాగుండాలనే
“లోకాస్సమస్తా సుఖినో భవంతు”-
అని లోకాన్ని ఆశీర్వదిద్దాం.
మనల్ను మనమే ఆశీర్వదించుకుందాం. -పమిడికాల్వ మధుసూదన్