మాటలొద్దు చేతల్లోనే CM మమతా మార్క్..

దేశంలోని ముఖ్య‌మంత్రులంద‌రిలో పశ్చిమ బెంగాల్ సీఎం ఎప్పుడూ డిఫ‌రెంటే. ఆమె ఏది చేసినా వినూత్న‌మే. అది విమ‌ర్శ అయినా ప్ర‌శంస‌లైనా. ప్ర‌స్తుతం క‌రోనా క‌ట్ట‌డిలో కూడా ఆమె చ‌ర్య‌లు అద్భుత‌మ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఇటీవ‌ల దీదీ బెంగాల్‌లోని మార్కెట్ యార్డ్‌లో చేసిన చ‌ర్య‌తో ఆమెపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. లాక్‌డౌన్ తీరుపై స్వయంగా పర్యవేక్షణ… కూరగాయల మార్కెట్‌లో సామాజిక దూరంపై సూచనలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్నాయి.

ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. జనాలను ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని చెప్పినా ఎవ్వ‌రూ అస‌లు వినడం లేదు. నిత్యావసరాలు, కూరగాయల పేరుతో బయటకు వస్తున్నారు. అందరూ గుంపులు, గుంపులుగా వస్తున్న ప‌రిస్థితి నెల‌కొంటుంది. పోనీ వచ్చిన వాళ్లు సామాజిక దూరం పాటిస్తున్నారా అంటే అదీ లేదు. గుంపులుగా నిలబడి నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. అక్కడక్కడా పోలీసులు, అధికారులే రంగంలోకి దిగి.. సామాజిక దూరంగా పాటించేలా.. సర్కిల్స్ గీస్తున్నారు. దీనివ‌ల్ల ప్ర‌జానీకం దూరంగా ఉంటార‌ని అధికారులు ఆశిస్తున్నారు.


అయితే, పశ్చిమబెంగాల్‌లో మాత్రం ఏకంగా ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా రంగంలోకి దిగారు. లాక్‌డౌన్ జరుగుతున్న తీరును ఆమె స్వయంగా పర్యవేక్షించారు. అధికారులతో కలిసి మార్కెట్లను పరిశీలించారు. ఓ మార్కెట్‌లో జనాలు సామాజిక దూరం పాటించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతనే చొరవ తీసుకున్నారు. సామాజిక దూరం పాటించేలా సర్కిల్స్‌‌ను ఆమె గీశారు. ఆ గీత‌ల‌ను త‌ప్ప‌క పాటించాల‌ని స్థానికుల‌కి సూచించారు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన ప్ర‌జానీకం హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. దాంతోపాటు, మార్కెట్‌లలో పర్యటించిన సమయంలో ఆమె స్వయంగా తన కారులోంచి మాస్క్‌లు తీసుకుని అందరికీ అందజేశారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా వ్యాపారులకు సూచనలు చేశారు. దీంతో మమతపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. సీఎం స్థానంలో ఉన్నా ఆమె స్వయంగా ప్రజల ఇబ్బందుల్ని తెలుసుకునేందుకు రోడ్లపైకి రావడం గ్రేట్ అంటున్నారు. ఎంతైనా దీదీ స్టైలే డిఫ‌రెంట్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి మీరేంటారు. సెల్యూట్ దీదీ!