‘భాగమతి’ హిందీ రీమేక్ టైటిల్ మార్పు

రెండేళ్ల క్రితం ప్రముఖ నటి అనుష్క నటించిన కథానాయిక ప్రధాన చిత్రం ‘భాగమతి’. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి అనుష్క అభినయానికి వేదికగా నిలిచింది. ఆమెకు నటిగా మంచి పేరును తేవడంతో పాటు బాక్సాఫీసు వద్ద కూడా ఈ చిత్రం విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు.తెలుగు మాతృకకు దర్శకత్వం వహించిన అశోక్ దీనికి కూడా దర్శకత్వం వహించాడు. ఇక కథానాయికగా భూమి ఫడ్నేకర్ నటించింది. దీనికి మొదట్లో ‘దుర్గావతి’ అనే పేరును నిర్ణయించారు. అయితే, తాజాగా దీనిని కాస్త సవరించారు. ‘దుర్గామతి’గా ఈ టైటిల్ని మార్చడం జరిగింది.ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నెల 11న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా ఇది విడుదల కానుంది.