మానవ సేవే మాధవ సేవ ఆంటోన్న బిల్‌గేట్స్
జీవితమంతా దాతృత్వానికే అంకితం చేయనున్న కుబేరుడు
– సమాజానికి మేలు చేసేది కొందరే. ప్రపంచంలో చాలా మంది సంపన్నులున్నా వారంతా తమ వారసులకు సంపదను కూడబెట్టేందుకు ప్రధాన ధ్యేయంతో పని చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం తాము సంపాదించిన దాంట్లో అధిక మొత్తం సమాజ సేవ చేయడానికి ముందుంటారు. అలాంటి వారిలో అపర కుబేరుడిగా పేరుగాంచిన బిల్‌గేట్స్. తన ఆచరణలో నిజం చేస్తున్నాడు. ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం
మానవ సేవే మాధవ సేవ ఆంటోన్న శ్రీమంతుడు బిల్ గేట్స్.
– అతను 18 సంవత్సరాల పాటు అహర్నిషలు కృషి చేసి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచాడు. కంప్యూటర్లపై ఉన్న తన మక్కువకు సాఫ్ట్వేర్ రూపమిచ్చిన ఆయన నేడు ప్రపంచంలో ప్రతి ఇంటికీ కంప్యూటర్ని చేర్చడంలో కీలకపాత్రే పోషించారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ అనే సంస్థను స్థాపించి సొంత బిడ్డలా పెంచి పోషించారు.
తన సంపదలో 95శాతం దాతృత్వానికే వెచ్చిస్తున్న బిల్ గేట్స్
ఇకపై పూర్తిగా సేవకార్యక్రమాలకే పరిమితం కానున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి భూరి విరాళం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. నేడు ఆయన నిష్క్రమణను ప్రపంచమంతా చర్చించుకుంటోందంటే సమాజము కోసం ఆయన సేవా దృక్పధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
థింక్ బింగ్ డ్రీమ్:
– నేడు కంప్యూటర్ లేనిదే ప్రపంచం నడవదు. ఈ క్రమంలో వచ్చిన సమాచార సాంకేతిక విప్లవానికి బిల్ గేట్స్ ఆద్యుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాల్యపు ఛాయలు వీడకముందే ఒక మహా సంస్థను స్థాపించి ప్రపంచ దిశ-దశను మార్చేందుకు కంకణం కట్టుకుని ముందుకు కదులుతున్నారు. ఈ ప్రయాణంలో సమకూరిన సంపదనంతా సమాజ శ్రేయస్సుకే వెచ్చించాలన్న ఆయన ఆశయం నిజంగా గొప్పది.
ఫస్ట్ సాఫ్ట్వేర్…
– ఈ కుబేరుడి బాల్యం అంతా ఆటపాటలతోనే గడిచింది. తండ్రి అటార్నీ జనరల్ కాగా, తల్లి టీచర్. ఆయనకు ఓ అక్క, చెల్లి ఉన్నారు. తన ఏడో యేట స్కూల్లో చూసిన కంప్యూటర్ అతణ్ని అమితంగా ఆకట్టుకుంది. ఇక అదే తన జీవిత నేస్తం అని భావించారు. ఆ నేస్తంతో ఆయన చేసిన చెలిమే నేడు మనందరి ఇళ్లకు కంప్యూటర్ చేరేలా చేసింది. ఈ క్రమంలో సీనియర్ విద్యార్థి పాల్ అలెన్‌తో బిల్‌కు పరిచయం ఏర్పడింది. ఇదే అతని జీవితాన్ని మలుపుతిప్పింది. 13 ఏళ్ల ప్రాయంలోనే బిల్ మొట్టమొదటి సాఫ్ట్‌వేర్‌ని రూపొందించారు. అది పిల్లలు ఆడుకునే వీడియోగేమ్‌కు సంబంధించింది. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత హార్వర్డ్‌లో చేరారు. ఆ సమయంలో బేసిక్ అనే కంప్యూటర్ ప్రోగ్రాం రాసి తన భవితకు బాటలు వేసుకోవడంతో పాటు ప్రపంచ సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టారు.
మైక్రోసాఫ్ట్ మయం…
వాణిజ్యపరంగా విజయం సాధించిన అల్టైర్ 8800కు బిల్‌గేట్స్ మరికొంతమంది స్నేహితులతో కలిసి ప్రోగ్రాం రాశారు. దీంతో ఆయన మనసు వ్యాపారంపైకి మళ్లింది. ఇక తన చదువుకు స్వస్తి పలికి మైక్రోసాఫ్ట్ అనే సంస్థను నెలకొల్పారు. అప్పటి నుంచి వెనుదిరగలేదు. సాఫ్ట్వేర్ చరిత్రకు ఆద్యుడయ్యారు. కొత్త రంగాలను పసిగట్టడం. అందుకనుగుణంగా కొత్త వ్యుహాలు, ప్రణాళికలు రచించడం వాటిని అమలుపరచడం. ప్రతిభ ఉన్న చిన్న కంపెనీలను తనలో కలిపేసుకోవడం. ఇలా ఆయన చేసిన ప్రతి ప్రయోగం ఫలించింది. అంటే ఆయన అంచనాలు, ఊహాశక్తి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి కచ్చితత్వం సమకూర్చుకోవడానికి ఆయన తన జీవితాన్నే ధారపోశారు.
ఐబీఎం అందలం:
– 1981లో బిల్‌గేట్స్, ఐబీఎం పరిచయం మొత్తం పర్సనల్ కంప్యూటర్ల తీరుతెన్నులనే మార్చేసింది. ఐబీఎం తమ కంప్యూర్లకు మంచి సాఫ్ట్వేర్ కోసం వెతుకుతున్న నమయంలోనే బిల్ గేట్స్ పరిచయం అయ్యారు. ఆ సమయంలో సీటెల్ కంప్యూటర్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ క్విక్ అండ్ క్యూ డాస్ అనే ఆపరేటింగ్ సిస్టంను అభివృద్ధి చేసింది. దాన్ని బిల్ 56వేల డాలర్లకు కొనుగోలు చేశారు. దానిలో కొన్ని మార్పులు చేసి ఐబీఎంకు విక్రయించారు. ఇక్కడ ఆయన పెట్టిన చిన్న మెలిక ఆయన్ని వ్యాపార సామ్రాజ్యానికి ఎనలేని లాభాల్ని తెచ్చిపెట్టింది. ఆ సాఫ్ట్‌వేర్‌ను ఇతర సంస్థలకు అమ్మే హక్కుల్ని తన వద్దే ఉంచుకున్నారు. దీంతో ఆయన లాభాల పంటపండింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మైక్రోసాఫ్ట్ ఎంఎస్-డాస్‌ను మార్కెట్లోకి తెచ్చారు. ఇది మంచి విజయం సాధించింది.
విండోస్ ఎఫెక్ట్..
– 1985 ప్రపంచ సాఫ్ట్వేర్ మార్కెట్లో కొత్త శకం ప్రారంభమైంది. విండోస్ ప్రవేశించింది. తొలి దశ పెద్దగా ఆకట్టుకోలేదు. 1990 మేలో తెచ్చిన రెండో దశ ఫరవాలేదనిపించింది. కానీ, 1995లో వచ్చిన మూడో వెర్షన్ సంచలనంగా మారింది. మూడేళ్లలో కనకవర్షం కురిపించింది. అనంతరం 1998లో వచ్చిన వెర్షన్ మైక్రోసాఫ్ట్‌కు తిరుగులేని పునాదులు వేసింది. నాటి నుంచి వచ్చిన అన్ని కంప్యూటర్లలో విండోస్ తప్ప వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది కాదంటే అది ఎంతలా విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదారుడికి అత్యంత అనుకూలంగా ఉండే ఈ వెర్షన్ తదనంతరం అనేక మార్పులకు లోనవుతూ మరింత సౌకర్యవంతంగా మారింది.
కాంతి వేగంతో ప్రయాణం:
– సరిగ్గా ఆ సమయంలోనే ఇంటర్నెట్ ప్రజాదరణ పొందడం మొదలుపెట్టింది. కళ్లకు ప్రపంచాన్ని ఆవిష్కరించే ఈ వ్యవస్థ బిల్ దృష్టి సారించారు. ప్రారంభంలో సన్ ఇంటర్నెట్ సేవల్ని అందించడంతో గేట్స్ శకం ముగిసిందనుకున్నారు. కానీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తెచ్చి అవన్నీ అబద్దం అని నిరూపించారు. తన ముందుచూపుతో హార్డ్‌వేర్ కంపెనీలతో చేతులు కలిపి ఎక్స్‌ప్లోరర్‌ను కంప్యూటర్లతో పాటు ఉచితంగా ఇచ్చారు. దీంతో సమాచారం విప్లవం మరింత వేగవంతం అయింది.
కలియుగ కర్ణుడు:
-ఉదయం తొమ్మిది గంటల కల్లా బిల్ కొత్త సాంకేతికత సృష్టిపై విస్తృతంగా చర్చలు జరిపేవారు. మధ్యాహ్నానికి లాభాలు పెంచే వ్యూహాలపై నిపుణులతో తన ఆలోచనలు పంచుకునేవారు. ఈ క్రమంలో రోజు రూ.వందల కోట్ల ఆయన ఖాతాలో వచ్చి చేరేవి. ఇక సాయంత్రం కాగానే వాటిని సమాజ శ్రేయస్సుకు ఎలా ఖర్చు చేయాలో స్వయంగా కూర్చొని ప్రణాళికలు వేసేవారు. ఇది ప్రపంచ కుబేరుడు దశాబ్దాల పాటు కొనసాగించిన దినచర్య. ఈ క్రమంలోనే ఆయన ఎవరూ అధిరోహించని శిఖరాలకు చేరుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సమాజంలో పెరగుతున్న ఆర్థిక అసమానతలు, పేదలపై ప్రతాపం చూపిస్తున్న అంటువ్యాధులు, పౌష్టికాహార లోపంతో తల్లడిల్లుతున్న పిల్లలు.. ఇవే ఆయన మదిలో మెదిలాయి. అందుకే తాను సంపాదించిన దానిలో 95 శాతం దాతృత్వ కార్యక్రమాలకే కేటాయించాలని నిర్ణయించుకున్నారు.
మానవ సేవే మాధవ సేవ:
– బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ స్థాపించి అనేక దేశాల్లో తన సేవాకార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. ప్రతి దేశానికి ప్రయాణిస్తూ అక్కడ అమలవుతున్న కార్యక్రమాల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇతర బిలియనీర్లతో కలిసి ‘గివింగ్‌ప్లెడ్జ్’ అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీంతో ప్రతి ఒక్కరూ సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దానిలో ఇప్పటి వరకు 150 మంది బిలియనీర్లు చేరారు. మన దేశంలో అజీమ్ ప్రేమ్‌జీ, కిరణ్ మజుందార్ షా వంటి ప్రముఖులు భాగస్వాములయ్యారు. భారతదేశంలోనూ విస్తృత సేవలు అందిస్తున్న గేట్స్ తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
పుస్తకం ఓ మంచి మిత్రుడు..
-ఎంత పని ఉన్నా బిల్ గేట్స్ పుస్తకాలను చదవడం మాత్రం ఆపరు. ఎక్కడికెళ్లినా పుస్తకాలను మోసుకెళ్తారు. గోల్ఫ్, బ్రిడ్జ్ ఆటలంటే అమితాసక్తి. గత 1994లో మిలిందాను పెళ్లి చేసుకున్న ఐదేళ్ల తర్వాత సీఈవో బాధ్యతల నుంచి వైదొలిగారు. గత 2000 సంవత్సరం నుంచి కంపెనీ ఛైర్మన్ బాధ్యతలకు మాత్రమే పరిమితమై రోజువారీ కార్యక్రమాలను తన బాల్య స్నేహితుడు స్టీవ్ బాల్మర్‌కు అప్పగించారు. అప్పటి నుంచి గత 2014 సంవత్సరం వరకు ఛైర్మన్‌గా కొనసాగారు. ఆ తర్వాత నుంచి బోర్డు డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నారు. తాజాగా దానికి కూడా రాజీనామా చేయడంతో కంపెనీ నుంచి పూర్తిగా వైదొలిగినట్లయింది.