త్వరలోనే పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ

త్వరలోనే పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ

కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడట్లేదు.. ఈ నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలపై సందిగ్ధత నెలకొంది. అయితే, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు. ఈ సమావేశాలపై త్వరలోనే సర్కారు తేదీలు నిర్ణయిస్తుందని తెలిపారు.కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే వర్షాకాల సమావేశాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. అలాగే, పార్లమెంట్‌ స్థాయీ సంఘాలు క్రమం తప్పకుండా సమావేశవుతున్నాయని చెప్పారు. త్వరలోనే సమావేశాల నిర్వహణపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ తేదీలను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలతోనూ ఇదే విషయంపై చర్చిస్తుందని వివరించారు. కాగా, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 25, 26న వడోదరలోని కెవాడియాలో అఖిల భారత ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే పాల్గొని మాట్లాడతారు.