కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో వితంతువులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు కేంద్రం బాసటగా నిలుస్తోంది. మూడు నెలల ఫించను ముందుగానే వారి ఖాతాల్లో జమచేయడానికి కేంద్రం సంసిద్ధమయ్యింది. అంతేకాదు, కరోనా ప్యాకేజీ కింద రెండు విడతల్లో కలిపి రూ.1000లు ఇస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదిరకకే ప్రకటించారు. కరోనా కలకలంతో విధించిన లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో వితంతువులు, దివ్యాంగులతో పాటు సీనియర్ సిటిజన్లకు మూడు నెలల ఫించను ముందుగానే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలోని సుమారు 2.98 కోట్ల మంది అర్హులైన ఫించనుదారులకు లబ్ధి చేకూరనుంది. వచ్చే నెల మొదటి వారంలో 3 నెలల ఫించను తాలూకు మొత్తాలు లబ్ధిదారుల ఖాతాల్లో జమకానుంది. జాతీయ సామాజిక చేయూత పథకం కింద 60-79 ఏళ్ళ సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.200లు, 80 ఏళ్ళ పైబడిన వారికి రూ.500లు చొప్పున ఫించను అందచేస్తోంది. ఇక వితంతువులు 40-79 ఏళ్లలోపు వారికి రూ.300లు, 80 ఏళ్ళు పైబడిన వారికి రూ.500లు చొప్పున ఫించను అందచేస్తోంది. అలాగే 79 ఏళ్ళ వరకు ఉన్న దివ్యాంగులకు రూ.300లు, 80 ఏళ్ల ఉన్న వారికి రూ.500ల చొప్పున నెలకు ఫించను అందచేస్తోంది.