రెడ్డీస్​ కు కేంద్రం షాక్​.. ‘స్పుత్నిక్​ లైట్​’ ట్రయల్స్​ కు అనుమతి నిరాకరణ

రెడ్డీస్​ కు కేంద్రం షాక్​.. ‘స్పుత్నిక్​ లైట్​’ ట్రయల్స్​ కు అనుమతి నిరాకరణ

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. దేశంలో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ కు అనుమతిని నిరాకరించింది. కరోనా వ్యాక్సిన్లపై కేంద్రం ఏర్పాటు చేసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) నిపుణులు స్పుత్నిక్ లైట్ ట్రయల్స్ కు అనుమతులపై నిన్న సాయంత్రం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.వ్యాక్సిన్ పై మూడో దశ ట్రయల్స్ చేయడానికి ఎలాంటి ‘శాస్త్రీయ హేతుబద్ధత’ కనిపించట్లేదని, కాబట్టి రెడ్డీస్ దరఖాస్తును పరిశీలించాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడినట్టు అధికారులు చెబుతున్నారు. “రెడ్డీస్ ట్రయల్స్ చేయాలనుకుంటున్న స్పుత్నిక్ లైట్.. స్పుత్నిక్ వీలో మొదటి డోసే. అంతకుముందు స్పుత్నిక్ వీకి సంబంధించి రెండు డోసుల వ్యాక్సిన్ ప్రభావం గురించి ముందే తెలిసింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ డేటా చూస్తే అది అంత ప్రభావవంతం కాదని తేలింది. కాబట్టి స్పుత్నిక్ లైట్ పై మరోసారి ట్రయల్స్ చేసేందుకు ఎలాంటి హేతుబద్ధత కనిపించట్లేదు’’ అని నిపుణులు పేర్కొన్నట్టు తెలుస్తోంది.కాగా, మేలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు భారత్ లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత లక్షన్నర డోసులను రష్యా పంపించగా.. ఆ తర్వాత కొన్ని రోజులకు 30 లక్షలకుపైగా డోసులను పంపించింది. రీకాంబినెంట్ డీఎన్ఏ సాంకేతికతతో అడినోవైరస్ వెక్టార్లుగా స్పుత్నిక్ వీని అభివృద్ధి చేశారు. రీకాంబినెంట్ అడినోవైరస్ 26 (ఆర్ఏడీ 26), రీకాంబినెంట్ అడినోవైరస్ 5 (ఆర్ఏడీ 5) అనే రెండు డోసులుగా టీకాను ఇస్తారు. ఇందులో ఆర్ఏడీ 26 మొదటి డోసు కాగా.. ఆర్ఏడీ 5 రెండో డోసు. తర్వాత ఆర్ఏడీ26నే స్పుత్నిక్ లైట్ గా రష్యా ప్రభుత్వం మార్కెట్ లోకి తీసుకొచ్చింది.