ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? చంద్రబాబు

ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? చంద్రబాబు

సీఎం జగన్‌ తన మొండి వైఖరి, వితండవాదం వీడి 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. కరోనా వైరస్‌ ప్రభావంపై రాబోయే రెండు మూడు వారాలు చాలా కీలకమని చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందితే అదుపుచేయడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వైరస్‌ పూర్తిగా లేదని ప్రకటించేవరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చంద్రబాబు సూచించారు. డెంగీ విషయంలోనూ గతంలో తనను ఎగతాళి చేశారని, దోమలపై యుద్ధం చేస్తారా? అని అపహాస్యం చేశారని వైకాపానుద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, బెంగాల్‌లో అన్ని రకాల ఎన్నికలను రద్దు చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. కరోనాకు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ చాలని జగన్‌ అనడాన్ని జాతీయ మీడియా సైతం తప్పుబట్టిందని చెప్పారు. కరోనా వైరస్‌ విషయంలో 4 వారాల పాటు ఎలాంటి సమస్య ఉండదని సీఎస్‌ అంటున్నారని.. సీఎస్‌కు దీనిపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు.

‘కరోనాపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా.. హెచ్చరిస్తున్నా. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటారా? ఇంకా మీలో చలనం రాదా? ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చినవారి గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్‌ ఇంకా ఎలా ఆలోచిస్తున్నారు. గెలిచాం అనిపించుకోవాలనే తపన తప్ప ప్రజల ప్రాణాలంటే సీఎంకు లెక్కలేదు. రెండు నెలలు ఎన్నికలు వాయిదా వేస్తే ఏమవుతుంది? 6,777 మంది విదేశీయులు వచ్చారు. వారి చిరునామాలు ఉన్నాయా? సుప్రీంకోర్టు కూడా రోజువారీ కేసుల సంఖ్యను తగ్గించుకుంటోంది. కరోనా ఈ దశాబ్దపు మహమ్మారి అని బిల్‌గేట్స్‌ అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజులు పరీక్షించాలని మీకు తెలుసా? తూర్పుగోదావరి జిల్లాకు 900 మంది ఎన్‌ఆర్‌ఐలు వచ్చారని తెలుస్తోంది. వీటన్నింటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.