గ్రేటర్ హైదరాబాద్ మాంసం దుకాణాల్లో తనిఖీలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మటన్ దుఖాణాలపై పశుసంవర్ధక శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కరోనా నేపద్యంలో నగరం లో మాంసం దుఖాణాల నిర్వాహకులు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారనే పిర్యాదులు రావడంతో విస్తృత తనిఖీలు నిర్వహించి అక్రమాలకూ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మటన్ దుఖాణాలపై తనిఖీల కోసం ఏర్పాటైన డాక్టర్ బాబుబేరి, డాక్టర్ ఖాద్రి, డాక్టర్ సింహారావు, డాక్టర్ సుభాష్, నిజాం లతో కూడిన 5 గురు పశుసంవర్ధక శాఖ అధికారుల బృందం బుధవారం కూకట్ పల్లి, JNTU, ప్రగతి నగర్, బాల నగర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాలలో 5 దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న ఓ దుఖాణాన్ని సీజ్ చేశారు. మటన్ కిలో 700 రూపాయలకు మించి విక్రయించవద్దని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధరలు తెలిపేలా డిస్ ప్లే బోర్డులను షాపుల లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పరిశుభ్రత పాటించాలని, దుఖాణాలకు వచ్చే వారు కనీసదూరం పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.