రెండు గంటల్లో కరోనా టెస్ట్ వచ్చిందోచ్…(ప్రపంచ రికార్డు)

మన దేశంలో అతి తక్కువ ఖర్చుతో రెండు గంటల్లో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షా ఫలితాలను తెలిపే ఓ డయాగ్నొస్టిక్ పరీక్షా పరికరాన్ని శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ, త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించింది.

ఈ విధమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ధారణ డయాగ్నొస్టిక్ పరీక్ష చేసి సార్స్ – కోవ్-2 కు చెందిన ఎన్ – జెన్ వైరస్ జన్యువుని కనిపెట్టే విధానం బహుశా ప్రపంచంలో ఇదే ప్రధమం కావచ్చు.

డి.ఎస్.టి. నిధులతో రూపొందిన ఈ పరీక్షా పరికరాన్ని “చిత్ర జెన్ లాంప్- ఎన్ ” అని పిలుస్తారు. ఇది సార్స్ -కోవ్ -2 ఎన్-జెన్ కోసం చాలా ప్రత్యేకమైనది. జన్యువు యొక్క రెండు ప్రాంతాలను ఇది గుర్తిస్తుంది. ఈ వైరస్ యొక్క జన్యువు ప్రస్తుత వ్యాప్తి సమయంలో మార్పు చెందినప్పటికీ పరీక్ష విఫలం కాకుండా ఇది చూస్తుంది.

ఎన్.ఐ.వి. అలప్పుజ (ఐ.సి.ఎం.ఆర్. చే గుర్తించబడినది) వద్ద నిర్వహించిన నిర్ధారణ పరీక్షలో చిత్రా జెన్ లాంప్ – ఎన్ ఫలితాలు ఆర్.టి.-పి.సి.ఆర్. తో వచ్చిన నమూనా పరీక్షా ఫలితాలతో పోలిస్తే నూరు శాతం ఖచ్చితంగా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని భారతదేశంలో కోవిడ్-19 పరీక్ష కోసం దీనిని ధృవీకరించే సాధికార సంస్థ అయిన ఐ.సి.ఎం.ఆర్. కు తెలియజేయడమైంది. వినియోగం కోసం తయారుచేయడానికి సి.డి.ఎస్.సి.ఓ. నుండి లైసెన్స్ పొందవలసి ఉంటుంది.

భారతదేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న పి.సి.ఆర్. పరికరం స్క్రీనింగ్ కోసం ఈ జన్యువును, నిర్ధారణ కోసం ఆర్.డి.ఆర్.పి. జన్యువును గుర్తించడానికి పనికి వస్తోంది. అయితే, జెన్ లాంప్-ఎన్ పరికరం స్క్రీనింగ్ టెస్ట్ అవసరం లేకుండానే, అతి తక్కువ ఖర్చుతో, జన్యువు టెస్ట్ తో పాటు నిర్ధారణ కూడా చేయడానికి ఉపయోగపడుతుంది.

గుర్తించడానికి 10 నిముషాల సమయం పడుతుంది. నమూనా నుండి ఫలితం రావడానికి (శ్వాబ్ లో ఉన్న ఆర్.ఎన్.ఏ. ను బయటకు తీయడం దగ్గర నుండి ఆర్.టి.-లాంప్ ను గుర్తించే వరకు) రెండు గంటల కంటే తక్కువ సమయం పడుతుంది. ఒకే ఒక యంత్రంలో ఒకే సారి మొత్తం 30 నమూనాలు పరీక్షించగల సామర్ధ్యాన్ని కలిగి ఉండడం వల్ల ప్రతీ రోజూ పెద్ద సంఖ్య లో నమూనాలను పరరీక్షించడానికి అవకాశం ఉంటుంది.

కోవిడ్-19 నిర్ధారణకు ఒక వినూత్నమైన, తక్కువ ఖర్చుతో, వేగవంతంగా ఫలితాల నందించే పరికరాన్ని శ్రీ చిత్ర సంస్థ అతి తక్కువ సమయంలో అభివృద్ధి చేయడం అభినందనీయం. వైద్యులు, శాస్త్రవేత్తలతో కూడిన సృజనాత్మక బృందం కలిసి పనిచేస్తే మౌలిక సదుపాయాలు పెంపొందుతాయనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి. మరియు నాలుగు ఇతర డి.ఎస్.టి. సంస్థల వద్ద సాంకేతిక పరిశోధన కేంద్రం నెలకొల్పడం వల్ల ప్రాధమిక పరిశోధనలు ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానాలుగా రూపొందడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి.” అని డి.ఎస్.టి. కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ పరికరాన్ని జిల్లా ఆసుపత్రులకు చెందిన ప్రయోగశాలలో, పరిమిత సౌకర్యాలతో, శిక్షణ పొందిన సాంకేతిక సిబ్బందితో సులువుగా ఏర్పాటుచేసుకోవచ్చు. పరీక్షా ఫలితాలను పరికరం మీదనే తెలుసుకోవచ్చు. ఈ కొత్త పరికరంతో పరీక్ష నిర్వహించడానికి ఒక్కొక్క పరీక్షకి అయ్యే మొత్తం ఖర్చు వెయ్యి రూపాయల కంటే తక్కువ అవుతుంది.

శ్రీ చిత్ర సంస్థ జెన్ లాంప్-ఎన్. పరీక్ష పరికరం తో పాటు ప్రత్యేకంగా ఆర్.ఎన్.ఏ. సేకరించే కిట్స్ ను కూడా అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎర్నాకులం లో జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించే ఒక ప్రముఖ సంస్థ అగప్పె డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ కు ఉత్పత్తి కోసం బదిలీ చేసింది.

సంస్థ బయోమెడికల్ టెక్నాలజీ విభాగం లో సీనియర్ శాస్త్రవేత్త, అప్లైడ్ బయాలజీ విభాగం కింద మొలిక్యూలర్ మెడిసిన్ డివిజన్ ఇంచార్జ్, డాక్టర్ అనూప్ తెక్కువీట్టిల్, తన బృందంతో కలిసి ఈ కిట్ ను గత మూడు వారాల్లో అభివృద్ధి చేశారు.