సినిమా థియేటర్లపై కరోనా ప్రభావం
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ చిత్ర పరిశ్రమపై
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. కరోనా భయంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రద్దీగా ఉండే షాపింగ్‌మాల్స్, సినిమా హాళ్లలో జనం లేకుండా పోతున్నాయి. దీంతో ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో నిర్మాతల మండలి సమావేశమైంది. కరోనా వైరస్ ప్రభావంతో థియేటర్ల మూసివేతపై ఈ భేటీలో చర్చించారు. కరోనా విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాము సినిమాల విడుదల, ప్రస్తుత పరిస్థితులపై చర్చించామని, సినిమా థియేటర్లు బంద్ చేయాలని ప్రభుత్వం సూచిస్తే తప్పకుండా మూసివేస్తామన్నారు.
ఉగాది పండుగకు సినిమాలు ఉన్నట్టా? లేనట్టా?
తెలుగు సినిమాకి కీలకమైన సీజన్ వేసవి కాలం. ఎందుకంటే అందరికి సెలవులు అందుబాటులో ఉంటాయి అలాగే తెలుగు సంవత్సరాది ఉగాది ప్రారంభం అవుతుంది. అందుకే నిర్మాతలు పక్కా ప్రణాళికలతో సినిమాల్ని విడుదల చేసుకోవడానికి సిద్ధమవుతారు. కానీ 2020లో మాత్రం కరోనా మన తెలుగు వెండి తెరని కమ్మేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముందుగా నెల్లూరులో థియేటర్లు బంద్ అయ్యాయి. బయటి రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ ఇప్పటికే కరోనా ప్రభావం బలంగా ఉండటంతో మన సినిమాలకి వాయిదాలే శరణ్యంగా పరిస్థితులున్నాయి. ఒక్క సినిమా వాయిదా పడిందంటే
ఆ తర్వాత సినిమాల విడుదల తేదీలు తారుమారువుతాయి. ఉగాదికి విడుదల కావల్సిన నాని సినిమా ‘వి’ ఏప్రిల్ 2న విడుదల కావల్సిన రానా ‘అరణ్య’ వాయిదా పడింది. అనుష్క ‘నిశ్శబ్దం’ విడుదలపైనా సందిగ్ధం నెలకొంది. ఈ పరిణామాలు మన సినిమా పరిశ్రమకి నష్టం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయనడంలో సందేహం లేదు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేతపై చర్చ
ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ఇప్పటికే థియేటర్ల దగ్గర సందడి లేదు, వసూళ్లు చాలా తగ్గిపోయాయి, బలమైన సినిమాలు లేవు కాబట్టి మామూలే అనుకున్నాం.
మార్చి 25 నుంచి పెద్ద సినిమాలున్నాయి కానీ కరోనా ముప్పు పరిశ్రమపై ప్రభావం చూపిస్తుంది. వేసవి కాలంలో థియేటర్లు మూసేస్తే సినిమాలకి ఇబ్బంది ఎదురవుతుంది. విడుదల చేయాల్సిన సినిమాలు ఆగిపోతే నిర్మాతలపై వడ్డీల భారం పెరిగిపోతుంది. ఆ తర్వాత అన్ని సినిమాల్నీ ఒకేసారి విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. దేనికీ సరైన వసూళ్లు రావు. థియేటర్లు మూసివేస్తే అక్కడ పనిచేసే ఉద్యోగులకీ ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. సినిమాకే కాదు, అన్ని రంగాలపైనా కరోనా ప్రభావం ఉండటం భాధకరమన్నారు.