మేమున్నాం భయమోద్దు CM జగన్

కోవిడ్‌–19 వైరస్‌ నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసు నుంచి మాట్లాడారు.

ముఖ్యమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు:
– కరోనా వైరస్‌ నియంత్రణకు ఏ కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
– వైరస్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడంతో పాటు, వారికి చికిత్స అందించడంలో సమర్థ విధానం అవలంబిస్తోంది.
– గత రెండు రోజులుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం బాధ కలిగిస్తోంది.
– ఢిల్లీలో జరిగిన సదస్సుకు ఇక్కడి నుంచి హాజరైన వారికి వైరస్‌ సోకింది.
– అందుకే ఢిల్లీకి వెళ్లిన వారిని, వారితో ప్రయాణించిన వారిని, వారితో కాంటాక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించేందుకు ప్రభుత్వం ఒక గట్టి ప్రయత్నం చేస్తోంది.
– ఈ వైరస్‌ ఒక సిగ్మా మాదిరి.. అది వస్తే ఏదేదో జరిగిపోతుందని ఎవరూ అనుకోవద్దు. ఈ వైరస్‌కూడా దాదాపు ఒక జ్వరం, ఫ్లూ వంటిదే.
– కాకపోతే వయోవృద్ధులు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారిపై ఇది కాస్త ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎవరూ అధైర్యపడొద్దు.
– కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వైరస్‌ మాత్రమే అని గుర్తు పెట్టుకోండి.
– దేశ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్‌ రావడం, ఆ తర్వాత వారు చికిత్స పొంది బాగు కావడం కూడా చూశాం.

ఇప్పటి వరకు 87 పాజిటివ్‌ కేసులు:
– ఇప్పుడు రాష్ట్రంలో గుర్తించిన 87 పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 70 కేసులు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారే.
– రాష్ట్రం నుంచి దాదాపు 1085 మంది ఢిళ్లీ వెళ్లగా, వారిలో 585 మందిని పరీక్ష చేయగా, వారిలో 70 పాజిటివ్‌గా వచ్చాయి.
– మరో 500 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇంకా 21 మంది జాడ తెలియడం లేదు.
– కాబట్టి వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారు కానీ మీ అంతట మీరే 104 కు ఫోన్‌చేసి మీ అంతట మీరే స్వయంగా పరీక్ష చేయించుకోండి.

సర్వే కోసం వచ్చిన వారికి చెప్పండి:
– ప్రతి ఇంటికి కూడా.. గ్రామ వలంటీర్, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, స్థానికంగా ఉన్న రిసోర్స్‌ పర్సన్లు సర్వే చేస్తున్నారు.
– కాబట్టి ఎవరికి ఆరోగ్యం బాగా లేకున్నా, జ్వరంగా ఉన్నా, శ్వాసకోశ సంబంధ సమస్యలున్నా ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్పండి. వెంటనే మీకు వైద్యం అందుతుంది.
– కరోనా సోకిన వారిలో 81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి వైద్యం చేయించుకుని నయమయ్యారు. వైద్యం పొంది ఒక 14 రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉంటే చాలు. ఏ సమస్య ఉండదు.
– కేవలం 14 శాతం మాత్రమే ఆస్పత్రులలో చికిత్స పొందుతుండగా, వారిలో కేవలం 4 నుంచి 5 శాతం మాత్రమే ఐసీయులో చికిత్స పొందుతున్నారు.
– కాబట్టి ఎవరికి బాగా లేకున్నా, సర్వే కోసం వచ్చినప్పుడు చెప్పండి.
– వెంటనే మీకు వైద్యం అందించడమే కాకుండా, అవసరమైన ఔషథాలు ఇస్తారు. మీకు తోడుగా ఉంటారు. అవసరమైతే ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం అందేలా చూస్తారు.

ప్రైవేటు ఆస్పత్రులు, వైద్య కళాశాలలు:
– ప్రైవేటు ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది.. మీరంతా ఇన్‌వాల్వ్‌ కావాలని కోరుతున్నారు.
– 104 కు ఫోన్‌ చేసి మీ పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా మీరు మనస్ఫూర్తిగా ముందుకు రావాలని కోరుతున్నాను.

ఆదాయం తగ్గింది. ఖర్చు పెరిగింది:
– రాష్ట్రంలో ఈ కరోనా దాడి వల్ల ఆదాయం పూర్తిగా మందగించిన పరిస్థితి.
– మరోవైపు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తోడ్పాటు అందించడంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి.
– ఇలా అనుకోని వి«ధంగా ఆర్థిక భారం చాలా పడింది.

వాయిదాకు సహకరించారు. ధన్యవాదాలు:
– వేతనాలు పోస్ట్‌పోన్‌ చేసుకుని సహకరించిన అందరు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, పెన్షనర్లు..
– మీకు కష్టమనిపించినా, సహకరించారు. అందుకు మీ అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతులు.

సామాజిక దూరం పాటించండి:
– వ్యవసాయం చేసుకుంటున్న రైతులు, రైతు కూలీలు, ఆక్వా రంగంలో ఉన్న రైతులు, రైతు కూలీలకు కొన్ని సలహాలు. అందరికీ ఒకటే విజ్ఞప్తి.
– గ్రామాల్లో మీరు 1 గంట వరకు మీమీ పనులు చేసుకోండి. ఏ ఇబ్బంది లేదు.
– వ్యవసాయం, రైతులు, రైతు కూలీలు బతకాలి. కాబట్టి ప్రభుత్వం ఎవరినీ ఆక్షేపించడం లేదు.
– కానీ, ఒక సూచన. మీరు మీ మీ పనులు చేసుకునేటప్పుడు కనీసం ఒక మీటరు దూరం పాటించండి.
– ఆక్వా రంగంలోని ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ రంగానికి చెందిన ఆయిల్‌మిల్లులు, పప్పు మిల్లులు, యూనిట్లు ఎవరి పని వారు చేసుకోవచ్చు.

జ్వరం వంటిదే. చికిత్స పొందితే చాలు:
– కోవిడ్‌–19 ఒక జ్వరం వంటిదే. మందులు వేసుకుని, 14 రోజుల పాటు జాగ్రత్తగా స్వీయ నిర్భంధంలో ఉంటే తప్పనిసరిగా నయం అవుతుంది.

వివక్ష చూపకండి. ఆదరించండి:
– కరోనా సోకిన వారిని వేరుగా చూడకండి. వారిని ఇంకా మంచిగా చూసుకోండి.
– వారిపై ఇంకా ఎక్కువ మానవత్వం చూపాలి. ఏ మాత్రం వివక్ష చూపవద్దు.
– కరోనా సోకిన వారు మన నుంచి ఆశించేది కాస్త ఆప్యాయత, ప్రేమ మాత్రమే.

104కి ఫోన్‌ చేయండి చాలు:
– మీరు చేయాల్సిందల్లా 104కి ఫోన్‌ చేయడం.
– వైద్యులు వస్తారు. చికిత్స చేస్తారు. అవసరమైతే ఆస్పత్రికి తరలిస్తారు.
– కాబట్టి వివక్ష చూపకుండా, ఆదరించి, వైద్యం చేయించమని కోరుతున్నాను.