మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతిపై సీఎం జగన్ స్పందన

మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతిపై సీఎం జగన్ స్పందన

కరోనా మహమ్మారికి బలైన వారిలో ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కూడా చేరారు. ఇటీవల కరోనా బారినపడిన ఎస్వీ ప్రసాద్ హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆయన పరిస్థితి విషమంగా ఉంది. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిపాలనలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వ్యక్తి ఎస్వీ ప్రసాద్ అని కీర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎస్వీ ప్రసాద్ 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2010లో ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్రానికి సీఎస్ గా వ్యవహరించారు. అనేకమంది సీఎంలకు సెక్రటరీగా వ్యవహరించారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం

అటు, ఎస్వీ ప్రసాద్ మరణం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎస్వీ ప్రసాద్ తో తనకు సుదీర్ఘమైన అనుబంధం ఉందని తెలిపారు. ఎస్వీ ప్రసాద్ వంటి కార్యదక్షత ఉన్న అధికారులు అండగా ఉంటే, ప్రభుత్వ పాలన సాఫీగా సాగిపోతుందని కొనియాడారు. నిజాయతీపరుడైన వ్యక్తిగా చిరస్మరణీయుడని పేర్కొన్నారు.