KCR నోట హెలికాఫ్టర్ మనీ. అంటే ఏంటి??

దేశంలో లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ పతనం
హెలికాప్టర్ మనీ తప్ప మరో మార్గం లేదు: TS CM KCR
PMతో వీడియో కాన్ఫ‌రెన్స్- సూచించిన సీఎం కేసీఆర్

విశ్వాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. ప్రపంచ దేశాలన్నీ అతులాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెకేందుకు ‘హెలికాప్టర్‌ మనీ’ అనే కొత్తం అంశాన్ని తెరపైకి తెచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. తాజాగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. అయితే ఇప్పుడు ‘హెలికాప్టర్‌ మనీ’ అంటే ఏమిటి అన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. హెలికాప్టర్‌ మనీ అంటే హెలికాప్టర్ నుంచి డబ్బును వెదజల్లడం అనుకుంటారు. అయితే ఓ రకంగా అలాంటిదే. ఎలాగంటే కేంద్ర ప్రభుత్వాలు, బ్యాంకులు నగదు నిల్వలను మార్కెట్‌లోకి తీసుకురావడమే ‘హెలికాప్టర్‌ మనీ’ అంటే అర్థం. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు వారికి తక్కువ వడ్డీకి నగదు అందజేస్తారు. వస్తువుల రేట్లు పడిపోయి మార్కెట్లు సంక్షోభంలోకి వెళ్లకుండా ఆర్థిక సమతుల్యత సాధించడమే హెలికాప్టర్‌ మనీ ప్రధాన ఉద్దేశం.

మన దేశంలో లాక్‌ డౌన్‌తో దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు నూతన ఆర్థిక విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపాదించారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు హెలికాప్టర్‌ మనీ, క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ (QE) విధానాలు అమలు చేయాలని సూచించారు. అసలేమిటి హెలికాప్టర్‌ మనీ, క్యూఈ? దీని వల్ల ఏం జరుగుతుంది???

దేశంలో కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయి. వస్తు, సేవల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఆర్థిక వ్యవ్యస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 2.8 శాతం మాత్రమే పెరగొచ్చని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు హెలికాప్టర్‌ మనీ, క్యూఈ ఆర్థిక విధానాలు చేపట్టాలని ప్రధానికి సీఎం కేసీఆర్‌ సూచించడంతో ఇవి తెరపైకి వచ్చాయి.

చిన్నతనంలో నోట్ల కట్టలు ఎవరైనా ఆకాశం నుంచి వెదజల్లితే ఎంత బాగుండో అని మనలో చాలామంది అనుకునే ఉంటారు. ఇంచుమించు అలాంటిదే ఈ హెలికాప్టర్‌ మనీ. అంటే ప్రజలకు డబ్బులు ఉచితంగా ఇవ్వడం. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఫ్రెడ్‌మ్యాన్‌ 1969 హెలికాప్టర్‌ మనీ విధానాన్ని ప్రతిపాదించారు. 2002లో ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ బెన్‌ బెర్నాంకే దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ విషయంలో మన దేశంలో ఆర్‌బీఐది కీలక పాత్ర. దీని ప్రకారం నోట్ల ముద్రణ పెంచి ఆర్థిక వ్యవస్థలోకి పెద్దఎత్తున నగదును చలామణీలోకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనుగోలు శక్తిని పెంచడం దీని వెనుకున్న ఆంతర్యం. ప్రజల వద్ద డబ్బులు లేక కొనుగులు శక్తి తగ్గిపోయిన నేపథ్యంలో డబ్బులను విరివిగా ఇవ్వడం ద్వారా డిమాండ్‌ను, సప్లయ్‌ను పెంచడానికి ఈ విధానం దోహద పడుతుంది. క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ కూడా ఇలాంటిదే అయినా దీనికి ప్రభుత్వం వద్ద నుంచి ఆర్‌బీఐ బాండ్లు కొనుగోలు చేస్తుంది. దీని కింద కూడా నోట్లను అధికంగా ముద్రించాల్సి ఉంటుంది.

 

ఇంతకు ముందు ఈ విధానాన్ని అమెరికా, జపాన్‌ వంటి దేశాలు అవలంబించాయి. 2008లో సంభవించిన మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమెరికా హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అనుసరించింది. 2016లో జపాన్‌ సైతం హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అవలంభించింది.

ఇక్కడ ఇంకో ప్రశ్న నోట్ల ముద్రణను ఎల్లప్పుడూ ఎందుకు చేపట్టకూడదనే తలెత్తవచ్చు. దేశంలో వస్తు సేవల ఉత్పత్తి ఆధారంగా నోట్లను ముద్రించి ఆర్‌బీఐ చలామణీలోకి తీసుకొస్తుంది. ఒకవేళ నిత్యం నోట్లను పెద్ద సంఖ్యలో ముద్రించి జనాలకు చేరవేస్తే కొన్నాళ్లకు దాని విలువ పడిపోయే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం భారీ స్థాయిలో పెరిగిపోతుంది. అందుకే ఆర్థిక వ్యవస్థ మందగమనం ఎదుర్కొనేటప్పుడు మళ్లీ దానికి ఊతమిచ్చేందుకు ఇలాంటి విధానాలు చేపడుతుంటారు.