త‌పాలా ఉద్యోగులకు ₹10 ల‌క్ష‌ల ప‌రిహారం

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలోనూ ప్ర‌జా ప్ర‌యోజ‌నాలే ధ్యేయంగా ప‌ని చేస్తున్న త‌పాలా శాఖ ఉద్యోగుల‌కు ఆర్థిక‌ భ‌ద్ర‌త‌ క‌ల్పించేలా కేంద్రం గొప్ప నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో విధుల‌ను నిర్వ‌హిస్తున్న ఉద్యోగులు ఈ వైర‌స్ బారిన ప‌డి మ‌ర‌ణిస్తే రూ.ప‌ది ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. గ్రామ్ డాక్ సేవ‌క్ (జీడీఎస్‌) నుంచి మొద‌లు పోస్ట‌ల్ శాఖ‌కు చెందిన అంద‌రు ఉద్యోగుల‌కు దీనిని వ‌ర్తింప‌జేయ‌నున్నారు. త‌పాలా శాఖ సేవ‌లు అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల కింద‌కు వ‌స్తాయ‌ని హోం మంత్రిత్వ శాఖ‌ పేర్కొంది.

ఇదే విష‌యాన్ని ఈ నెల 15న చేసిన OM No. 40-3 / 2020-DM-I (A), పారా -11 (iii)లో పునరుద్ఘాటించింది. ఈ ప‌రిహారం చెల్లింపున‌కు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే అమలులోకి రానున్న‌ట్టుగా హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్‌-19 సంక్షోభపు స‌మ‌యం ముగిసే వరకు మొత్తం కాలానికి అంద‌రు త‌పాలా శాఖ ఉద్యోగుల‌కు ఈ భ్ర‌ద‌త కొన‌సాగ‌నుంది.

క‌రోనా వ్యాప్తి నెల‌కొని ఉన్న ప్ర‌స్తుత త‌రుణంలో త‌పాలా సేవ‌లు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ప్ర‌జ‌ల‌కు ఇంటి వద్దే బ్యాంక్‌లో ఉన్న డబ్బును ఉపసంహరించుకునే సౌలభ్యం, గ్రామీణ డాక్ సేవల‌తో సహా పోస్టల్ ఉద్యోగులు వివిధ విధులను నిర్వర్తిస్తున్నారు. వీటికి తోడు అదనంగా స్థానిక రాష్ట్ర యంత్రాంగం, అక్క‌డి పోలీసు అధికారుల సౌజ‌న్యంతో పోస్ట్ఆఫీస్ వ‌ర్గాల వారు కోవిడ్‌-19 కిట్లు, ఆహార పొట్లాలు, రేషన్ స‌రుకులు, అవసరమైన మందులను సైతం పంపిణీ చేస్తున్నారు. కోవిడ్‌-19 క‌ష్ట స‌మ‌యంలో తపాలా శాఖ‌లో డిపార్ట్‌మెంట‌ల్ విధులను నిర్వర్తించడంతో పాటు సామాజిక ప్రయోజనం కూడా వివిధ కార్య‌క్ర‌మాల‌లో పాలు పంచుకొంటుండ‌డం విశేషం.