2020లోనే సరిహద్దులో అట‌ల్ టన్నెల్ నిర్మాణం పూర్తి

కీల‌క నిర్మాణ‌ దశలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని పిర్ పంజాల్ శ్రేణులలో వ్యూహాత్మ‌కంగా చేప‌డుతున్న అటల్ టన్నెల్ పనులను పూర్తి చేయడానికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) చురుగ్గా చర్యల‌ను చేప‌డుతోంది. రహదారి ఉపరితల పనుల‌తో పాటు లైటింగ్, వెంటిలేషన్ మరియు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లతో సహా ఎలక్ట్రో-మెకానిక్ ఫిట్టింగుల అమ‌రిక‌లు ఏర్పాటు చేయ‌డ‌మైంది. సొరంగం యొక్క ఉత్తర పోర్టల్‌లోని చంద్ర నదిపై 100 మీటర్ల పొడవు గల ఒక స్టీల్ సూపర్ స్ట్రక్చర్ వంతెన ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉంది. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి కారణంగా 10 రోజుల పాటు పనులు నిలిపివేయబడ్డాయి. డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ ఈ విషయాన్ని హిమాచల్ ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ త‌రువాత ఏప్రిల్ 05వ తేదీన ఆన్-సైట్ శ్రామికులు, రాష్ట్ర ప్రభుత్వం చురుకైన సమన్వయంతో ప‌నులు తిరిగి ప్రారంభమైయ్యాయి.ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది సెప్టెంబ‌రులో అటల్ టన్నెల్ పనులు పూర్తయ్యేలా అవసరమైన అన్ని కోవిడ్ -19 వైర‌స్ నియంత్ర‌ణ జాగ్రత్తలతో సొరంగం ప‌నులను వేగంగా చేప‌డుతున్నారు. రోహ్తాంగ్ పాస్ నవంబర్ మరియు మే మధ్య పూర్తిగా మంచుతో కప్పబడినందున మనాలి-సర్చు-లే రహదారి ప్రతి సంవత్సరం దాదాపు ఆరు నెలలు పాటుగా మూసివేయబడుతోంది. ఈ నేప‌థ్యంలో అటల్ టన్నెల్ నిర్మ‌ణాన్ని చేప‌ట్టారు. ఈ సొరంగం ఏడాది పొడవునా మనాలిని లాహౌల్ లోయతో కలుపుతుంది మరియు మనాలి-రోహ్తాంగ్ పాస్ సర్చు-లేహ్ రహదారి మ‌ధ్య దూరాన్ని దాదాపుగా 46 కిలో మీటర్ల‌ మేర తగ్గిస్తుంది. లాహువల్ ప్రజలను ఏడాది పొడవునా భారత దేశంతో అనుసంధానం చేయ‌డంతో పాటు, భద్రతా దళాలకు ప్రధాన వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందించే ఫార్వర్డ్ కనెక్టివిటీగా ఈ సొరంగం సహాయపడుతుంది.