కరోనాతో జోగులాంబ జిల్లా జాగ్రత్త??

జోగులాంబ గద్వాల జిల్లాలో కాంట్రాక్టింగ్ ట్రేసింగ్ ప్రక్రియ ను మరింత ప్రణాళిక బద్దంగా నిర్వహించి ఇక నుండి కారోనా వ్యాప్తి చెందకుండా చూడాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాష్ట్ర డి.జి.పి. ఎం. మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి తో కలిసి బుధవారం మధ్యాహ్నం గద్వాలలోని కంటైన్మెంట్ ఏరియా అయిన వేదనగర్, మొమిన్ మోహల్లాలో పర్యటించి జిల్లా యంత్రాంగం కొరానా నియంత్రణకై తీసుకున్న చర్యలను పర్యవేక్షించారు.

అనంతరం కాలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శృతి ఓఝా, జిల్లా ప్రత్యేక అధికారి రోనాల్డ్ రోస్, జిల్లా ఇంచార్జ్ ఎస్పీ అపూర్వ రావు, ఐజీ శివశంకర్, జిల్లా అధికారులతో కారోనా నియంత్రణకు జిల్లాలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ ఒక వ్యక్తికి కారోనా పాజిటివ్ వచ్చిన వెంటనె అతను ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ తిరిగారు అనే అంశాల ఆధారంగా వ్యక్తులను గుర్తించాలన్నారు. వారందరిని వెంటనే క్వరంటాయిన్ లో పంపించడం, నమూనాలను సేకరించి పంపించటం పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన క్వరంటాయిన్ బారికేడ్లు సరిగ్గా లేవని, క్వరంటాయిన్ ఏరియా నుండి ఏ ఒక్కరూ బయటికి వెళ్లకుండా, కొత్తవారు లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. క్వరంటాయిన్ లో ప్రోటోకాల్ ప్రకారం నిర్వహణ ఉండాలని, అందులో ఉన్నవారు కలిసి ఒకచోట భోజనం చేయటం, కలిసి ఉండటం లాంటివి జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అక్కడి వ్యర్థాలను బయోమెడికల్ వెస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ కి అప్పగించాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రాష్ట్ర డీజీపీ యం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కారోనా వ్యాధి నియంత్రణ కు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు అందరూ ఒక జట్టు లాగ కలిసి పనిచెయాలని, అందులో ఎవరి బాధ్యత ఏమిటీ అనేది గుర్తించి కర్తవ్యం నిర్వహించాలని జిల్లా అధికారుల ను సూచించారు. పోలీస్ యంత్రాంగం తరపున కారోనా వ్యాధి నియంత్రణ కు అన్ని విధాలుగా సహకారం అందజేయటం జరుగుతుందన్నారు. గద్వాల జిల్లా ఇతర రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా అయినందున ఇతర రాష్ట్రాల నుండి ఎవరు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, లాక్డౌన్ అమలు విషయంలో కానీ క్వరంటాయిన్ నిర్వహణలో పోలీస్ శాఖ ద్వారా అన్నివిధాల పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఇక పైన జిల్లాలో ఒక్క కొత్త కారోనా కేసు రాకుండా జిల్లా అధికారులు అందరూ ఒక జట్టుగా పని చేయాలని తెలియజేసారు.

ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి జిల్లాలో కారోనా నియంత్రణ కు తీసుకున్న చర్యలు, నమూనాల సేకరణ ప్రక్రియ, క్వరంటాయిన్ నిర్వహనలో తీసుకుంటున్న చర్యల పై జిల్లా కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝా, ప్రత్యేక అధికారి రోనాల్డ్ రొసె, ఐజీ శివశంకర్ రెడ్డి, ఎస్పీ అపూర్వ రావు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , డా. అమరేందర్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. శశికళ తదితరులు పాల్గొన్నారు.