ప్రపంచంలో కరోనా కల్లోలం

కరోనా క‌ల్లోలం నుంచి యూర‌ప్‌, అమెరికా దేశాల్లో ఇంకా కోలుకోలేక‌పోతున్నాయి. ప్ర‌తి రోజు కొత్త కేసులు న‌మోదు అవుతుండ‌డంతో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 35.68 ల‌క్ష‌ల‌కు పైగా ఉంది. ఇప్పటివరకు 35,80,196 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,48,452 మంతి మృతి చెందారు. 11,59,211 మంది కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

ఇక యూర‌ప్‌ దేశాల్లో 15 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ‌గా లక్షా 43 వేలకు పైగా మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. అమెరికాలో 11,88,421 మంది క‌రోనావైర‌స్ బాధితులుండ‌గా, 1,78,594 మంది కోలుకున్నారు. కాగా, 68,602 మంది మృతి చెందారు.

ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే 3,23,883 క‌రోనా కేసులు నమోదయ్యాయి. 24,648 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. జ‌సాంద్ర‌త అత్య‌ధికంగా ఉండ‌డం వ‌ల్ల‌ భౌతిక దూరం పాటించడానికి అవకాశం లేని పరిస్థితుల నేప‌థ్యంలో నగరాల్లో ఎక్కువగా కరోనా వ్యాపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.

స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఇటలీలో మిలన్, బ్రిటన్‌లో లండన్, ఫ్రాన్స్‌లో పారిస్‌ నగరాల్లో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. రానున్న రోజుల్లో క‌రోనా ప్ర‌భావం మ‌రింత పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్న‌ట్టు ప‌రిస్థితులు తెలుపుతున్నాయి.