దేశంలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్‌కు కళ్ళెం పడడంలేదు. కరోనా వైరస్ తన పంజా విసురుతూనే ఉంది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారు కరోనా కాటుకు బలవుతున్నారు. ఇక రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కొవిడ్ ఆసుపత్రుల్లో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు.
కొవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. దేశంలో 46,711 కరోనా కేసులు నమోదు కాగా, వీటిలో సగానికి కన్నా ఎక్కువ కేసులు మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. ఒక్క మహారాష్ట్రలో 14541 కరోనా కేసులు నమోదుకాగా, 11,493 యాక్టీవ్కేసులు ఉన్నాయి. ఇక కరోనా మృతుల సంఖ్యను పరిశీలిస్తే దేశంలో ఇప్పటి వరకు 1583 మంది కరోనాతో మృతి చెందగా, ఒక్క మహారాష్ట్రలో మృతుల సంఖ్య 583గా ఉందంటే అక్కడ తీవ్రత ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక తరువాతి స్థానాల్లో గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కలిపి 20వేల కేసులు నమోదు అయ్యాయి. రోజుకు సగటున 1500 చొప్పున కొత్త కేసులు వస్తుండడం ఆందోళకరంగా మారుతోంది. 4న ఒక్కరోజే 2,573 కేసులు వచ్చాయి. 24 గంటల్లో 83 మంది మరణించారు. కోలుకుంటున్న వారి శాతం ఒక్కరోజు వ్యవధిలో 27.03 నుంచి 27.45కి చేరినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే లాక్డౌన్ మరో రెండు విడతలుగా పెరిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.