న్యూజిలాండ్ కు వెళ్లిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఆరుగురికి కరోనా పాజిటివ్

న్యూజిలాండ్ కు వెళ్లిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఆరుగురికి కరోనా పాజిటివ్

న్యూజిలాండ్ సిరీస్ కు వెళ్లిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. జట్టులోని ఆరుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా వైరస్ ను పూర్తిగా నియంత్రించిన దేశంగా న్యూజిలాండ్ ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ల రూపంలో కరోనా కేసులు బయటపడటంతో న్యూజిలాండ్ ఆందోళనకు గురవుతోంది. న్యూజిలాండ్ కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేస్తుంది.పాక్ క్రికెటర్లకు కరోనా అని తేలిన నేపథ్యంలో… న్యూజిలాండ్ ఆరోగ్యశాఖ పాక్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. క్యారంటైన్ నిబంధనలను పాకిస్థాన్ ఆటగాళ్లు ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది. ఆటగాళ్లు నిబంధనలకు లోబడి వ్యవహరించాలని… హోటల్ గదుల్లోంచి బయటకు రావద్దని హెచ్చరించింది.న్యూజిలాండ్ పర్యటనకు గాను ఆటగాళ్లు, మేనేజ్ మెంట్, సహాయ సిబ్బంది ఇలా మొత్తం 53 మంది అక్కడకు వెళ్లారు. వీరందరికీ లాహోర్ లో కరోనా పరీక్షలు నిర్వహించారు. అక్కడ ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. న్యూజిలాండ్ కు చేరుకున్న తర్వాత చేసిన టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారికి కనీసం మరో నాలుగు సార్లు కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తామని న్యూజిలాండ్ ఆరోగ్యశాఖ తెలిపింది.తాము కఠినమైన కోవిడ్ నిబంధనలు, లాక్ డౌన్లను పాటించామని… ప్రజలు కూడా క్రమశిక్షణతో వ్యవహరించారని… అందుకే కరోనాను తాము కట్టడి చేయగలిగామని న్యూజిలాండ్ ఆరోగ్యశాఖ తెలిపింది. పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఇక్కడి నిబంధనలను పాటించాలని సూచించింది. న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్థాన్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడుతుంది.