కరోనా వ్యాకరణం మీకోసం

కరోనా వ్యాకరణం
—————
సాధారణంగా మనకు పదో తరగతి పరీక్షల తరువాత భాషలో వ్యాకరణం అటకెక్కుతుంది. ఆపై ఒక వేళ ఉన్నా ఇంగ్లీషు వ్యాకరణం బతికి బట్టకడుతుంది కానీ, పాడు తెలుగు వ్యాకరణానికి పాత బట్టలు కూడా మిగిలి ఉండవు.

అక్షరాలు
పదాలు
వాక్యాలు
విభక్తి
వచనాలు
సంధి
సమాసం
ఛందస్సు
అలంకారాలు
ప్రకృతి – వికృతి
భాషాభాగాలు- అన్నీ కలిపితే వ్యాకరణం. ఇప్పుడు ప్రపంచమంతా ఒకే భాష, ఒకే బాధ, ఒకే వ్యథగా అంతా కరోనా ఆక్రమించింది.

అక్షరాలు
——–
క్షయం కానిది అ క్షయం – అదే అక్షరం. భాషకు ధ్వనిగా, లిపిగా సంకేతం అక్షరం. కరోనా కూడా అ క్షయం. నిజానికి కరోనా సూక్ష్మ క్రిమి, జీవి కూడా కాదు. కానీ, వైరస్ గా ఒక్కో పదార్థం మీద కొన్ని గంటలు సజీవంగా ఉంటూ క్షయం లేకుండా భూగోళమంతా వ్యాపించగలిగింది.

పదాలు
——-
తెలుగు పదాలు నాలుగు రకాలు. తత్సమం, తద్భవం, దేశ్యం, అన్యదేశ్యం. కరోనా అన్య దేశమయినా ఇప్పుడు ప్రతిదేశానికి సొంతమై దేశ్యమే అయ్యింది. చైనా వూహాన్ తో తత్సమమా? తద్భవమా? అని తలలు పట్టుకుని ఇప్పుడు పద విభజన చేసుకుని ప్రయోజనం లేదు.

వాక్యాలు
——–
వాక్యం చాలా పెద్ద సబ్జెక్టు. మరీ లోతుగా వెళ్లడం ఈ సమయంలో మంచిది కాదు. అర్థవంతమయిన పదాల కలయిక వాక్యం అనుకుంటే చాలు. కర్త, కర్మ, క్రియ ఉండాలి. సంపూర్ణ, అసంపూర్ణ, సామాన్య, సంశ్లిష్ట, కర్తరి, ప్రశ్నార్థక . . . ఇలా వాక్యాల్లో లెక్కలేనన్ని రకాలు. ఇప్పుడు కర్త, కర్మ, క్రియ, సామాన్య, అసామాన్య, సంశ్లిష్ట అంతా కరోనా వాక్యమే. ప్రపంచం కరోనా వాక్యపాలనలో ఉంది.

విభక్తి
—–
చిన్నప్పుడు పొరపాటున, దురదృష్టం కొద్దీ తెలుగు మీడియం చదివినవారికి డు ము వు లు ప్రథమా విభక్తి అని ఏడు విభక్తులు; ఓరి ఓయి ఓసి – సంబోధన ప్రథమా విభక్తి కలిపి మొత్తం ఎనిమిది విభక్తులు విన్నట్లు, చదివినట్లు గుర్తుంటుంది. ఒకవేళ గుర్తు లేకపోయినా, ఇప్పుడు గుర్తుకు రాకపోయినా నష్టం లేదు. కరోనా దెబ్బకు మళ్లీ అందరూ భక్తి మార్గం పట్టారు. కరోనాకు ముందుకూడా గజ్జెలమల్లారెడ్డి చెప్పినట్లు తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పొంగుతోంది. కాబట్టి ఇప్పుడు విశేషమయిన విభక్తి రోజులు. కరోనాకు లింగం లేదు. కాబట్టి అన్ని లింగాలుగా దాని వ్యాప్తికి ఆస్కారం దొరికింది. ని ను న లన్ గూర్చి గురించి చేతన్ చే తోడన్ తోన్ వలనన్ కంటెన్ పట్టి . . . అన్ని ప్రత్యయాలను కరోనా వదలకుండా పట్టుకుంటుంది.

వచనం
——-
ఏక వచనంగా మొదలయిన కరోనా బహు బహువచనాలుగా ఎప్పుడో మారిపోయింది. ఇంగ్లీషు prose ను తెలుగులో వచనం అంటాం. ఇప్పుడు తెలుగు వచనమంతా కరోనానే. ప్రోజ్ ఒక్కటే సరిపోదు- కరోనా పోయెట్రీ, పాటలు కూడా అవసరమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. తెలుగులో ఏక వచనం, బహువచనం రెండే. సంస్కృతంలో ఏక, ద్వి, బహు వచనం- మూడు వచనాలు. తెలుగు రెండు వచనాలే ఏది ఎలా వాడాలో తెలియక వచనం పలుచబడిన వేళ ఇక ద్వి వచనం గొడవ మనకెందుకు? ఏకవచన ప్రయోగం అమర్యాద, తిట్టు.

సంధి
—–
అచ్సంధి, హల్సంధి, సంస్కృత సంధి, తెలుగు సంధి అని సంధుల్లో రకాలు. సవర్ణ దీర్ఘ సంధి లోకంలో చాలా పేమస్, చాలా ఈజీ. ఉదాహరణ-దేవ ప్లస్ ఆలయం- దేవాలయం. కరోనాకు కూడా సవర్ణ దీర్ఘ సంధి ఇష్టం. మనిషి ప్లస్ మనిషి దగ్గరగా ఉంటే కరోనా సవర్ణ దీర్ఘమై క్వారంటైన్ సంధిలో పడుతుంది.

సమాసం
——–
వేరు వేరు అర్థాల పదాలు ఒక పదంగా మారడం- లేదా ఒక అర్థంగా సమసించిపోవడం సమాసం. అవ్యయీ భావ, ద్విగు, ద్వంద్వ, బహువ్రిహి ఇలా చాలా సమాసాలున్నాయి. జలుబు దగ్గు ద్వంద్వ సమాసం. వైరస్ వ్యాప్తి అవ్యయీ భావం- అంటే ఎప్పటికీ ఎండ్ కాని ఫీలింగ్. ఏయే దేశాల్లో, ఏయే రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్, నెగటివ్, క్వారంటైన్ నంబర్లు ద్విగు సమాసం. దేశాల సరిహద్దులు దాటి కరోనా కరాళ నృత్యం చేయడం బహు పద ద్వంద్వ సమాసం. ప్రపంచం ఈ బాధను అనుభవించడం ఖర్మధారయ సమాసం.

ఛందస్సు
——–
గురువు- లఘువుల మీద ఛందస్సు ఆధారపడి ఉంటుంది. తలకట్టు లఘువు. దీర్ఘం గురువు. ఒక తలకట్టు- ఒక దీర్ఘం కలిస్తే ప్లుతం అని ఇంకొకటి కూడా ఉంది. మూడు తలకట్లతో సమానం. కరోనాకు తలా తోకా లేకపోయినా ప్రపంచం తలపట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. పద్యాల్లో వృత్తాలు, జాతులు, ఉపజాతులు ఉంటాయి. ఉత్పలమాల, చంపకమాల; కందం- ద్విపద; తేటగీతి, ఆటవెలది, సీసం. పద్యానికి నాలుగు పాదాలు, యతి, ప్రాస, పాదానికి అక్షరాల నియతి తప్పనిసరి. పాటించేవారికే ఈ ఛందస్సు రూల్స్. కరోనాకు యతి, ప్రాస, గురువు, లఘువు లెక్కలేమీ ఉండవు.

అలంకారాలు
————
శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు భాషకు అందం. ఇప్పుడు అన్ని అలంకారాలు కరోనాలో లయించడంవల్ల ఇల్లు దాటకుండా ఎవరిమానాన వారు ఉంటే ఇంటిశబ్దాలంకారం. కరోనా బారినపడకుండా అర్థాలంకారం. లేకపోతే అనర్థాలంకారం. ప్రమాదాలంకారం. స్థూలంగా స్వీయ గృహ నిర్బంధాలంకారం.

ప్రకృతి- వికృతి
————-
భాషలో ప్రకృతి-వికృతి మహా అయితే శబ్దానికి సంబంధించినది. బయట ప్రకృతిని ఎంత వికృతిగా మార్చామో ఇంట్లో ఖాళీగా ఉన్న ఇప్పుడయినా ఎవరికి వారు ఆలోచించాల్సిన సమయం. ప్రకృతిలో ప్రాణముంది. వికృతిలో మరణముంది.

భాషాభాగాలు
————-
నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియలు, అవ్యయాలు- కలిపితే భాషాభాగాలు. కరోనా నామవాచకం. అదే సర్వనామం. దాని వ్యాప్తి క్రియలు. లింగభేదం, ప్రాంత భేదం లేకుండా అది వ్యాపించడం అవ్యయాలు.
-పమిడికాల్వ మధుసూదన్.9989090018
madhupamidikalva@gmail.com