అమెరికాలో క‌రోనా క‌రాళ‌నృత్యం!

అమెరికాలో క‌రోనా క‌రాళ‌నృత్యం!

త‌న సైనిక శ‌క్తితో యావ‌త్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ‌లాడించే అగ్ర‌రాజ్యం అమెరికాని క‌రోనా (కోవిడ్‌-19) క‌కావికలం చేస్తుంది. ఏ ఒక్క వర్గాన్ని, రంగాన్నీ వదలకుండా మొత్తం USపై విల‌య న‌ర్త‌న‌, ప్ర‌ళ‌య కీర్త‌న‌లు చేస్తోంది. శుక్రవారం ఉదయం నాటికి అందిన సమాచారం ప్రకారం అ దేశంలో కరోనా కేసుల సంఖ్య 85,612కు చేరి చైనాను అధిగమించింది. అలాగే 1,301 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో గురువారం ఒక్కరోజే 17 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక వాణిజ్య రాజధానిగా పేరొందిన న్యూయార్క్‌లో వైరస్‌ తీవ్రత రోజురోజుకూ విజృంభ‌ణ చేస్తోంది. మరోవైపు వైరస్‌ను కట్టడిచేయడంలో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుందని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే, దీనిపై అమెరికా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.

కరోనా పుర‌టిగ‌డ్డ‌గా పేరొందిన చైనాను అమెరికా అధిగమించడంతో యూఎస్ వాసులు తీవ్ర భయాందోళనలకు గురువుతున్నారు. చైనాలో ఇప్పటి వరకు 81,340 కేసుల నమోదు అయ్యాయి. ఆ సంఖ్యను అమెరికా భారీ స్థాయిలో అధిగమించింది. మరోవైపు ఇటలీలోనూ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇటలీలో 80,589, స్పెయిల్‌లో 57,786, జర్మనీ 43,938 కేసులు నమోదు అయ్యాయి. ఇక అత్యధిక మరణాలతో ఇటలీ చిగురుటాకులా వణుకుతోంది. ఇటలీలో 8,215, స్పెయిన్‌ 4,365, చైనా 3,292, ఇరాన్‌ 2,234 మరణాలను నమోదు అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 24 వేలుకు పైగా దాటిపోయింది. ఇక భారత్‌లో 727 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 16కు చేరింది. అయితే, ఈ సంఖ్య పెరుగుద‌ల కేవ‌లం అమెరికానే యావ‌త్ విశ్వాన్ని విస్తుపోయేలా చేస్తోంది.